ఈ సృష్టి ఒక్క సమయము అను మహా కాల ప్రవాహమునకు పోల్చి చూచినచో మానవ జీవితము ఒక్క నిమిషము మాత్రమే అగును. అనగా 100 సంవత్సరములు బ్రతికిన వాడు ఒక్క నిమిషము బ్రతికిన కీటకముతో సమానము. 50 సంవత్సరముల వయస్సులో పోయినవాడు అర నిమిషము బ్రతికినవాడు. 25 సంవత్సరముల వయస్సులో పోయినవాడు పావు నిమిషము బ్రతికినవాడు. మనము చూచు చుండగనే మన కంటి ఎదుట ఒక కీటకము ఒక నిమిష కాలము బ్రతికినది. మరియొక కీటకము పావు నిమిషమే బ్రతికినది. మొదటి కీటకము ఎట్టి వేదనయు లేక మరణించినది. రెండవ కీటకము పావు నిమిషము బ్రతికి చివరిలో ఒక క్షణకాలము హింసను అనుభవించి మరణించినది. మొదటి కీటకము నిమిషము బ్రతికినను ఎట్టి హింసయు లేక మరణించినను మరణానంతరము కోట్ల సంవత్సరములు హింసకు గురియైనది. రెండవ కీటకము పావు నిమిషమే బ్రతికినను ఒక క్షణకాలము హింసననుభవించినను, మరణానంతరము కోట్ల సంవత్సరములు ఆనందముతో తేలియాడినది. ఈ రెండు కీటకములలో ఏ కీటకమును గురించి నీవు దుఃఖించవలెను? మొదటి కీటకము గురించియే "అయ్యో! పాపము" అనవలెను. రెండవ కీటకమును గురించి కాదు. కావున 32 సంవత్సరములు మాత్రమే బ్రతికి చిట్ట చివరిలో 4 రోజులు భగందర వ్యాధితో బాధపడి మరణించి, తరువాత సృష్టి ఉన్నంతకాలము శివ సాయుజ్యమును పొందిన ఆది శంకరుల యొక్క అల్పాయుర్ధాయమును గురించికాని, ఆయన అనుభవించిన రోగబాధను కాని చింతించి సానుభూతి చూపనవసరము లేదు. మరియొకడు కాకి వలె నూరేండ్లు జీవించి పెద్ద వైద్యాలయములో మరణించి తరువాత సృష్టి ఉన్నంతకాలము నరకమున పడినాడు. ఈ రెండవ వాని గురించియే ఏడ్చి సానుభూతి చూపవలెను. భగవంతుని దృష్టిలో మొదటివాడు 100 క్షణములు, జీవించినాడు. రెండవ వాడు 32 క్షణములే జీవించినాడు. ఈ క్షణకాలములో ఒకనికి ఓరిగినది లేదు మరియొకడు నష్టపడినది లేదు. ఈ క్షణకాలము తరువాత జీవుడు పొందు నిత్య శాశ్వత ఫలమును గురించిన ప్రయత్నము చేసుకొనుట ఎంతో వివేకమైయున్నది. ఈ క్షణకాల సుఖములలోపడి ఈ క్షణకాలము మాత్రమే ఉండు పతి, పుత్ర, ధన, దారా బంధముల వ్యామోహములలోపడి నిత్య ఫలమును నాశము చేసుకున్నవాడు ఎంతో అవివేకి. ఈ అవివేకమునకు కారణము కాలము యొక్క జ్ఞానము లేకపోవుటయే కావున కాలజ్ఞానము గల యోగి శాశ్వత ఆనందమును సంపాదించు కొనుటకై ఈ క్షణకాలమును సాధనతో సద్వినియోగము చేసుకొనును. కావున ఈ జీవుడు మరణమును గురించి కాని, మరణవేదనను గురించికాని, ఈ క్షణ జీవితకాలములో జరుగు కష్టనష్టముల గురించి కాని ఆలోచింప పనిలేదు. ఒకరి జీవితము బాగున్నది. నా జీవితము బాగా లేదని చింతింప పనిలేదు. అట్లే ఒకడు అల్పాయుర్దాయుడు, మరియొకడు పూర్ణాయుర్దాయుడని పలుక పనిలేదు. ఇవి యన్నియును ఒక్క క్షణకాలము లోని బేధములే. మరణానంతరము పొందు ఫలము అనంత కాలము ఉండునది. అట్టి నిత్య ఫలమును గురించి భగవంతుని ప్రార్ధించవలయునే కాని, అసత్యములు క్షణికములైన వాటిని గురించి, వారిని గురించి పరమాత్మను అర్ధింపనేల? అంతే కాదు ఈ ఒక్క క్షణకాలము ముగియగనే నీ శరీరము కూడ నశించి పంచభూతములలో కలసిపోవుచున్నది. అట్టి క్షణికమైన నీ శరీరము యొక్క రోగబాధలను గురించి భగవంతుని యాచింపనేల? నీవు అడగ తలచుకున్నచో మరణానంతరము సిద్ధించు ఆ నిత్య ఫలమును గురించియే అర్ధించవలెను. కావున కాలజ్ఞానము తెలిసిన వారు ఎంతో వివేకముతో ఈ క్షణకాల జీవితములో చేసిన సాధన ద్వారా శాశ్వతమైన బ్రహ్మ సాయుజ్యమను అమృతఫలమును పొందుచున్నారు. ఇదియే నిజమైన కాలజ్ఞానము. అంతే కాని భవిష్యత్కాలములో జరగబోవు లౌకిక విషయముల గురించి తెలుసుకొనుట కానేకాదు.
ఇప్పుడున్న లౌకిక విషయములే నిన్ను సర్వనాశనము చేయుటకు చాలును. నిన్ను ఒక్క క్షణకాలములో భస్మము చేయుగల హాలాహల విషము నీ చేతిలో ఉండగా, అది చాలక ఇరుగుపొరుగు వారి ముచ్చట్లు, టి.వి, సినిమాలు, నవలలు, కధలు ఇంకనూ భవిష్యత్పురాణము, కాలజ్ఞానము అను కుండలు కుండలు విషము కొరకు పరుగిడు చున్నావు. నీ యొక్క అవివేకమును చూచి పరమాత్మ కన్నీరు కార్చుచున్నాడు. అట్టి నీవు అల్పాయుష్కులైన శంకరుల గురించి ఆయన పడిన నాలుగు రోజుల బాధను గురించి "అయ్యో పాపము " అనుచున్నావు. కాని నిత్య నరకములో పడిన నీ వెనుకటి తరముల వారి గురించియు, మరియు నీ గురించియు, మరియు నీ యొక్క రాబోవు తరముల గురించియు "అయ్యో! పాపము" అని పరమాత్మ కోటిసార్లు పలుకుచున్నాడు. క్రీస్తు మహాత్ముడు 34 సంవత్సరములు బ్రతికినాడు. నాలుగు గంటలు హింసను అనుభవించినాడు. ఆయన శిలువను మోసుకొని పోవుచుండగా చూచు చున్నవారు ఆయనకు వచ్చిన కష్టమును చూచి సానుభూతితో ఏడ్చినారు. లక్ష కొరడా దెబ్బలు తినబోవు వాడు నాలుగు కొరడా దెబ్బలు తినువాని చూచి ఏడ్చినట్లున్నది. వెంటనే ఆ మహాత్ముడు ఆగి వారి వైపు చూచి "మీరు నా కోసము ఏడవ వద్దు. మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి" అని చెప్పి ముందుకు సాగినాడు. కావున ఈ క్షణ జీవిత కాలములో క్షణికములగు ఐహికముల కొరకు గాని, ఆయురారోగ్యముల కొరకు గాని, మృత్యువును గురించి కాని చింతించు మూర్ఖుడు మరియొకడు ఉండడు. క్షణకాలములోని బాధలను అవివేకముతో చింతించుచున్నాడే తప్ప, తర్వాత వచ్చు శాశ్వత బాధల గురించి తెలుసుకొనుట లేదు. క్రైస్తవ మతము ప్రకారముగా జీవునకు మరల మానవ జన్మ ముగియగనే తుది తీర్పు ఉండును. ముక్తులు శాశ్వతముగ పరమాత్మ వద్దకు చేరుదురు. బద్ధులు శాశ్వతముగ నరకమున పడుదురు. హిందుమత సిద్ధాంతము కూడా ఇదే చెప్పుచున్నది. "జంతూనాం నర జన్మ దుర్లభమిదమ్" అని హిందూమత సంప్రదాయము చెప్పుచున్నది. అనగా మానవ జన్మ దుర్లభమని అర్ధము. ఎడారిలో మంచినీరు దుర్లభమనగా అర్ధమేమి? ఎడారిలో మంచి నీరు లభించదు అనియే గదా. కావున ఇదం నరజన్మ= ఈ మనుష్య జన్మ, జంతూనాం = జంతువులకు, దుర్లభం = మరల లభించదు. కావున ఏ మతము చెప్పినను, సత్యము సత్యమే. అమెరికాలో దొరికినను, ఇండియాలో దొరికినను వజ్రము వజ్రమే. గులక రాయి గులకరాయే. ఐతే ఇచ్చట మరియొక సత్యమున్నది. ఈ సత్యము ముందు చెప్పిన సత్యమునకు విరుద్ధము కాదు. అది ఏమనగా పరమాత్మ వద్దకు చేరిన ముక్త జీవులు మానవులను ఉద్ధరించుటకు, పరమాత్మతో పాటు మానవ జన్మలను పొందుదురు. అంతే కాని నిత్య నరకమున పడిన బద్ధ జీవులకు మరల మనుష్య జన్మలేదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి