12, అక్టోబర్ 2009, సోమవారం

మిత్రుడు లేని ఊరు

చాలా కాలానికి వెళ్లాను ఊరికి
ఊరు మొదట్లోనే కాళ్లు కడిగే చెరువులా.....
ప్రేమగా పలకరించే పైరు గాలిలా
ఆత్మీయ రాగమై రావాల్సిన మిత్రుడు రాలేదు
అందరూ రంగుల గాలిపటాలై ఎగురుతున్నారు
ఆకులు రాల్చుకున్న చెట్లు
మొండితలలతో ఆకాశం తట్టు దీనంగా చూస్తున్నాయి
కళ్లనిండా కాంతులతో పాదాలకు రాసుకున్న బాల్యలేపనంతో
చాలా కాలానికి వెళ్లాను ఊరికి
ఊరంటే తల్లివేరుకదా
ఊరంటే అమ్మ పాడే కమ్మని జొలపాటల ఒడికదా
ఊరంటే తెలిసీ తెలియని వయసులో రాసుకున్న
ప్రేమలేఖల పొదరిల్లు కదా
ఊరంటే ఉద్వేగంతో హృదయాన్ని ఊపేసే
బాల్యస్నేహితానుభవాల తడిచిత్రంకదా
చాలాకాలానికి వెళ్లాను ఊరికి
రాగి చెట్టుకింద కరిగిపోయిన బాల్యాన్ని
అప్పుడప్పుడూ వాడు దోసిళ్లతో తాపించేవాడు
యాంత్రికంగా మారిపోయిన నా జీవనవాహికలోకి
ఏ రాత్రో చడీచప్పుడు చేయకుండా దూరి
ఉదయం వరకూ వెచ్చని కలగా
పచ్చని పల్లెగా నన్ను మార్చి
మళ్లీ నన్ను తడి క్షణాలపై నడిపించేవాడు
ఇప్పుడు ఊరికి పోయినా ఎందుకనో వాడు కనిపించలేదు
వెతుక్కుంటున్నాను....
కనిపించిన ఈతలబావుల దరులపై నిలబడి
కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాను
ఎండిపోయిన చెరువు గుండెపై నిలుచుని
గుండెలు పగిలేలా రోధిస్తున్నాను
నేను పారేసుకున్న నా బాల్యపుటుంగరాన్ని
దొంగిలించిందెవరని నాలో నేనే మథన పడుతున్నాను
కనిపించని మితృడికోసం....కరిగిపోయిన కల కోసం ఎక్కడవెతుక్కోను
ఊరు విడిచే ప్రతిసారీ కన్నీటి వీడ్కోలయ్యే
నా ఆత్మీయ స్నేహంకోసం ఏ బాల్యపు దారుల్లో అన్వేషించను
ఇప్పుడు నా మితృడులేడు
ఊరికి దూరంగా ఉన్న స్మశానంలో ప్రశాంతంగా నిదురించే స్నేహం
ఇక నేనెప్పుడూరికి వెళ్లినా చిక్కని చీకటిరాత్రిలా
రహస్యంగా నాతో సంభాషిస్తూనే ఉంటాడు
ఇప్పుడు ఏ సమాధిపై మొలిచిన మొక్కని తాకినా
నా మితృడి హృదయస్పర్శలా అనిపిస్తుంది