15, జనవరి 2011, శనివారం

బెంగుళూరులో భోజనాల గోల

బెంగుళూరులో " ఆంధ్రా స్టైల్ భోజనం" అన్న బోర్డ్ పెడితే చాలు, జనాలు తండోపతండాలుగా ఎగబడతారు. బోర్డ్ ఒక్కటి చాలు, లోపల మనం పచ్చ గడ్డి పెట్టినా సుబ్బరంగా చెల్లుతుంది. ఇక గొందుకి రెండు ఆంధ్రాస్టైల్ పూటకూళ్ళ దుకాణాలు. ఇక ఆంధ్రాస్టైల్ అని పెట్టాక గోంగూర, ఆవకాయ ఉండాలి కదా. అవి ఒక రెండు డబ్బాలు పడేస్తారు. అవితింటే ఇక జన్మలో వాటి జోళికి వెళ్ళరు . ఇక అరిటాకులో వడ్డనలు స్టార్ట్. అంటె అన్ని అలా అని కాదు . కాని చాలా వరకు అంతే.

ఇలాంటి భోజనం ఇలా ఎగబడి ఎలా తింటారా అనుకునేవాణ్ణి. ఇక హోటల్లకి వారాంతంలో వెళ్ళామా అంతే సంగతి. తిరుపతి పంక్తులు దేనికి పనికిరావు. కాని అక్కడ తినేవారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తారు. నలుగురికి తక్కువ కాకుండా, పిల్లలని వేసుకొని బయలు దేరతారు. ఇలాంటి బిజి జీవితంలో ఒకరితో ఒకరికి సమయం దొరకడమే తక్కువ. అలాంటి సమయంలో చక్కగా కలిసి వండుకు తింటే ఎంత సుఖం, ఆ నానా గడ్డి తినే బదులు.
మా శతమర్కటులకయితే తప్పదు మరి. వంటలు రావు వచ్చినా చేసుకునే సదుపాయాలు ఉండవు.

ఈ వేళ దాదాపు అరగంట వేచినాక సీటు దొరికింది. ఆ లైన్లొ బ్రహ్మచారుల్లాగా ఉన్నవాళ్ళు దాదాపుగా లేరు. దీని బట్టి నాకర్థమయ్యిందేంటంటే, బ్రహ్మచారులు ఎంచక్కా వంటలు చేస్తున్నారు. గృహస్థలు పూటకూళ్ళ దుకాణాలెమ్మట పడుతున్నట్టున్నారు. మా చిన్నప్పుడయితే ఎప్పుడు హోటల్ లో తిన్న జ్ఞాపకాలు లేవు. కాని ఇప్పుడు ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా బయటకి వెళ్ళాల్సిందే. ఇలా గృహస్థులు మాకు పోటి వస్తే మా పరిస్థితి ఏం కాను??? స్వతంత్ర భారతదేశంలో కనీసం ఇష్టం వచ్చినట్టు భొజనం చేసే హక్కు లేదా అని నిలదీస్తే నేనేమి చెయ్యలేను :)