15, ఫిబ్రవరి 2011, మంగళవారం

నేను సైతం కలలు గన్నాను

అబ్దుల్ కలాం కనమన్నట్టు
అద్భుతమైన కలలో తేలి
నేను సైతం కలలు గన్నాను
తేరగా తెరవేలుపుకు కుర్చీ వచ్చేస్తుందని

సినిమా ఠాగూర్ చెప్పినట్లు
నేను సైతం అంటూ
తెరవేలుపుతో పాటు వచ్చాను

తెగితే వెంట్రుకే కదా అని
అరంగేట్రం అయితే అద్భుతం

ఆ తరువాత ‘చేతి’ కి
వ్యతిరేకంగా పనిచేయడానికి
చేతి చమురు చాల వదిలింది

టికెట్టుకు పోతే టీత్ బయటబెట్టి నవ్వి
డబ్బులు తియ్యమంటే
అరువిప్పిచ్చుకొని
అరవిందు దగ్గర టికెట్టు తీసుకొని
అయిన వాళ్ళ దగ్గర అవమానాలు పొంది
ఓటర్ల చేతిలో అన్యాయం చెయ్యబడినా

పార్టీకి భగ్న ప్రేమికుడిగా భంగపడుతూ
భవిష్యత్ నాయకుడిగా
కలలను కొనసాగిస్తుంటే
హస్తిన రాయభారంతో
బ్రాంతి నుండి బయటపడి
బాధపడుతున్నా

అధ్యక్షులకైతే ఆ సముద్రంలో
ఏదో ఒక పదవి వస్తుంది
రెండిట్లో ఒకటోడి ఒక చోట
నాయకుడనిపించుకొన్నాడు మరి

గెలిచిన మిగితా వాళ్ళు కూడా
మిణుకు మిణుకు మనే ఆశలతో
మేము సైతం అంటూ
సముద్రంలో దూకడానికి సంసిద్దమయ్యారు

ఓడిన నేను ఇప్పుడు
ఓండ్ర పెట్టి ఒనగూర్చుకోనేది ఏముంది?

రక్త దానం చేసి చేసి మిగిలి ఉన్న
రక్తాన్ని మరగబెట్టుకోవడం ఎందుకు?

రేపటి తరం ధీరులకు రక్త వారధులు కట్టి
రిక్త హస్తాలతో నిలిచి
కుటుంబాలను కునారిల్లించుకోకండి అనే
సలహా ఇవ్వడం తప్ప చేసేదేముంది?