చిన్న తనంలో చందమామ ఒక్కటే నచ్చిన పుస్తకం. కొంత కాలానికి మరో పత్రిక కూడ పిల్లలకోసమే'ట' అనితెలిసింది. అదే బాలమిత్ర పత్రిక. బాలమిత్ర స్వతహాగా తమిళ పత్రిక అనుకుంటాను, తెలుగులో కూడ ప్రచురించటం మొదలుపెట్టారు. చందమామ తరహాలోనే బొమ్మలు అవి ప్రతి పేజీలో కుడి ఎడమ పక్కనఅప్పుడప్పుడూ కింద వేసేవారు. కాని చందమామకు ఉన్న 'మెరుపు' బాలమిత్రకు ఉండేది కాదు. పాపం వాళ్ళు మెరుపు కాయితం మీద ముఖ చిత్రం అచ్చు వేసేవారు అయినా చందమామ ముందు తేలిపోయ్యేది.
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నాను అంటే, ఈ రోజున ఆదివారం కదా అని అలమార్లు, షెల్ఫులు, సోరుగులు అన్ని గాలించి చెత్తంతా వదిలిస్తున్నాను. అందులో బాలమిత్ర ఒకటి, ఒక ఐదారేళ్ళ క్రితంది అనుకుంటాను, కనపడింది. దాంతోపాటే అలాగే కనిపిస్తున్న మరికొన్ని పుస్తకాలు కనడ్డాయి. పారేద్దామని అన్నిటిని ఒక మూలకి విసిరేశాను.
బాలమిత్రలె అని నేను పారేసిన వాటితో పాటుగా నేను గత పదేళ్ళల్లో అప్పుడప్పుడు కొన్న చందమామలు కూడా ఉన్నాయి. కాని పెద్దగా తేడా తెలియటం లేదు. గట్టిగా పట్టి పట్టి చూస్తె కాని ఇది చందమామ, ఇది బాలమిత్ర అని తెలియని స్థితికి వచ్చింది ప్రస్తుతపు చందమామ. అవే వడ్డాది వారి బొమ్మలు, కాని ప్రింటు చెయ్యటంలో పూర్వపు శ్రద్ధ లేదు. అందుకనే చందమామలో మెరుపు తగ్గింది. ప్రస్తుతం చందమామ పేరుతొ వస్తున్న పత్రిక ఏదో పాత వాసన పోక పారేయ్యలేక దాచుకోవటమే కాని, దాచుకోవటం వల్ల చోటు నష్టం తప్ప మరేమీ లేదు అనిపించింది.
పై విషయం గమనించి ఆశ్చర్యపోయి, నా దగ్గర వపాగారు వేసిన చందమామ అట్ట మీది బొమ్మలన్నీ ఒకచోట ఉంచిన విషయం జ్ఞప్తికి వచ్చి బయటకు తీశాను. అందులో ఒకే బొమ్మ ఆయన వేసినదే కొంతకాలం తరువాత మళ్ళి ప్రచురించినది దొరుకునా అని అన్వేషించటం మొదలు పెట్టాను. నా ప్రయత్నం ఫలించింది.
మహాభారత యుద్ధంలో భీష్ముడు పడిపోయినాక, ఆయన దాహాన్ని తీర్చటానికి అర్జునుడు తన ధనుర్విధ్యతో పాతాళ గంగతో ఆయనకు మంచి నీళ్ళు అందించే దృశ్యం . వడ్డాది పాపయ్య గారు అద్భుతంగా చిత్రీకరించారు. మొదటిసారి ఫిబ్రవరి 1974 సంచికలో వేశారు. అదే బొమ్మ ముఖ చిత్రంగా డిసెంబరు 2000 సంచికకు వేశారు . ఇరవై ఆరు సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఒక్క ధరలోనే కాదు (ఒకటి పక్కన సున్నా చేరింది) బొమ్మ విషయంలో కూడా స్పుటంగా తెలుస్తున్నది. 1974 లో లేని సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఎన్నో రెట్లు మన పత్రికల వారి వద్ద ఉన్నది. కాని 21 శతాబ్దంలో అచ్చు వేయబడిన బొమ్మ రెండున్నర దశాబ్దాల క్రితం వేసిన బొమ్మ కన్నా మెరుగుగా లేకపోగా, పాత బొమ్మే ఆకర్షణీయంగా ఉన్నది అనిపిస్తున్నది.
చందమామ ప్రస్తుత నిర్వాహకులు పత్రిక ప్రింటు వెయ్యటంలో కాని, అందులోని శీర్షికల విషయంలో కాని శ్రద్ధ తీసుకోవటం మొదలు పెట్టాలి. లేకపోతె, మన చిన్నప్పుడు మనకు తెలిసిన "మన తెలుగు చందమామ" ఎక్కువ కాలం మనగలుతుందా అని బాధపడటం తప్ప మరేమైనా చెయ్యగలమా!!??
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి