16, మార్చి 2011, బుధవారం

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి

మన దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని అందరికి తెలుసు. కుంభకోణాలు, అక్రమాలు, విలువల్లేని రాజకీయాలు తప్ప ఇంకేమి లేని పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు ట్యునీషియాలో, ఈజిప్టులో , యెమెన్లో ప్రజలు అవినీతి ప్రభుత్వాల మీద సమరశంఖం పూరించి ప్రభుత్వాలనే కూలదోస్తున్నారు. కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. నియంతలను తమ దేశాలనుండి తరిమి తరిమి కొడుతున్నారు. కాని మనం మాత్రం మన ఇళ్లకో కార్యాలయాలకో పరిమితమై ఏమీ పట్టనట్లుగా మన మానాన మనం రోజులు వెళ్ళదీస్తున్నాం. ఎందుకీ నిర్లిప్తత? లక్షల రూపాయల అవినీతికే కేంద్ర మంత్రుల రాజీనామా చేసే పరిస్థితినుండి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నా ఏమీ పట్టని స్థితికి చేరుకున్నాం. ఎక్కడ చూసినా నల్ల డబ్బు గురించే చర్చ.. కాని ఇంకా ఎన్నాళ్ళు చర్చిస్తాం? మన నోళ్ళు విప్పనంతకాలం , కాళ్ళు కదపనంతకాలం ఈ కుళ్ళు రాజకీయం, ఈ అవినీతి సాగుతూనే ఉంటుంది. దేశం కోసం వీధుల్లోకి వచ్చి సత్యాగ్రహం చేసిన ప్రజలు, దేశం కోసం ఆయుధం పట్టి ఉరికంబానికేక్కిన ప్రజలు ఇప్పుడు ఇళ్ళలో టీవీలలో నేరాలు ఘోరాలు చూస్తూ కాలం వెల్లబోస్తున్నారు. ప్రపంచ స్వాతంత్ర్య పోరాటాలకే స్ఫూర్తినిచ్చే ఉద్యమాన్ని నిర్మించిన మనం, ప్రపంచ దేశాలలో సాగుతున్న ఉద్యమాలను చూసి కొంచెమైన చలించట్లేదు. ఎవరు ఏమైపోయినా అక్కర్లేదు, ఎక్కడ ఎం జరిగిన మనకి అవసరం లేదు.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక ఉల్లి ధరలు మండినప్పుడు మాత్రమే మనకు ఈ ప్రభుత్వం గుర్తొస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతుకుతాం? ఛీ.. ఇదీ ఒక బ్రతుకేనా!

రాష్ట్రాన్ని, దేశాన్ని కొల్లగొట్టి వేలు లక్షల కోట్లు సంపాదించిన వారి కొడుకులు మనవళ్లు కొత్త పార్టీలు పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. మనకేం పట్టదు. మన దేశం ఎటు పోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? 23 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన, ఆంగ్లేయుల బుల్లెట్లకి నేలకొరిగిన భగత్ సింగ్, అల్లూరి సీతారామారాజుల ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? పరాయి పాలనని త్రిప్పికొట్టడానికి ఒక సైన్యాన్నే నెలకొల్పిన సుభాష్ చంద్ర బోస్ జాతీయ స్ఫూర్తి ఇంకా ఎంతమందిలో మిగిలుంది? కులం, మతం, ప్రాంతం అని వేలాడే దుష్ట రాజకీయనాయకుల తొత్తులుగా మారి వాళ్ళు విదిల్చే నోట్లు, సారా పాకెట్లు తప్ప జనం పాట్లు అవసరం లేనంత హీనంగా మారుతున్నామా!?

ప్రజలు రూపొందించిన లోక్ పాల్ బిల్లుకి ప్రభుత్వం తూట్లు పొడిచి దాన్ని సమూలంగా మార్చి వేసింది. లోక్పాల్ బిల్లు యధాతధంగా అమలైతే అవినీతిని దాదాపు అంతమొందించడం సాధ్యపడుతుంది. ఇప్పటికే దేశంలో పేరుకుపోయిన నల్లడబ్బును పెద్ద నోట్లను నిషేదించడం ద్వారా వెలికి తీయవచ్చు. కేవలం రూ.500 మరియు ౧౦౦౦ నోట్లను నిషేదించడం ద్వారా దాదాపు సగానికి పైగానే నల్లడబ్బును బయటికి తీయగలం. కేంద్రం వద్ద స్విస్ బ్యాంకులలో నల్ల డబ్బు దాచిన వారి వివరాలు ఉన్నా బయటపెట్టలేని బలహీన హీన స్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆయా దేశాలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని నల్లడబ్బుని వెలికితీయాలి. ఈ రెండు పనులను చేయడం ద్వారా మన దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న మౌలిక సదుపాయాలూ, నిరక్షరాస్యత , పేదరికం, సాంఘిక రక్షణ, నిరుద్యోగం లాంటి సమస్యలను దాదాపు రూపు మాపోచ్చు.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి, ప్రజలు పూనుకుంటే ప్రభుత్వాలు కూలుతోన్న రోజులివి. మన ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రజలలో చైతన్యం తీసుకురాగలిగితే ఇది అసాధ్యం కాకపోవచ్చు. దీనికి మనవంతుగా ప్రయత్నిద్దాం.

జై హింద్.

కామెంట్‌లు లేవు: