16, మార్చి 2011, బుధవారం

కాలచక్రంలో శూన్యం నేర్చిన అక్షరం నక్షత్రాల

పలకబట్టి బయలుదేరితే
కలుపు తీసిన పొలంలా
అమ్మ ముఖం విప్పారి మెరిసేది.
అ ఆ లు రాసిన పలక
అమ్మ వేళ్ళకు అందిస్తే
ఏరుకున్న అక్షరాల్ని వొళ్ళో దాచి మురిసేది
అమ్మ రూపం నా రూపానికి అద్ది మాసిపోయాక
పలకా బలపం లేని నా బాల్యం
బడికి స్వస్తి పలికింది.
పసివాడి నగ్నరూపం మొలతాడు కట్టి వేధికెళితే
మొలతాడు లేని మొలల మధ్య మొలతాడే మిన్న
అవయవాల్ని కప్పుతూ గోచి పెట్టినపుడు
గోచీలు లేని గోలీలాటలో గోచీదే ఆధిపత్యం
ఆరు తర్వాత ఎంతకూ గుర్తురాని అంకె కోసం
మోరెత్తిన బడిపిల్లవాడ్ని చూసి
ఇరవై గొడ్లను ఏకధాటిగా లెక్కించడం నా విజయగర్వం.
పుల్లతో పంటకాల్వ లోతు కొలిచి
పారబోయే పొలం లెక్కలు ఆశువుగా నా నోట దొర్లేవి
సూర్యగమనం చూసి గంటలు నిర్ధారించినపుడు
గతి తప్పిన గడియారం విస్మయ ద్రుశ్టులు పరిచేది.
కాళ్ళకు తగిలిన రాళ్ళను సమగ్రంగా పరిశీలించి
ఏ ఖనిజ సంపద నిక్షిప్తమో ఏకరువు పెట్టేవాడిని
కమ్మిన మబ్బు సాంద్రత బట్టి వర్షపాతపు అంచనాకు
కురవబోయే మేఘం అబ్బురపడేది.
రాతి మేద సుద్దగీతలు రాతలు కానేరవు
కాళ్ళూచేతుల వేళ్ళు లెక్కించడం లెక్కలు కానేకావు.
ఎక్కాల్సిన బస్సు చిరునామా ఎంతకూ చదవలేక
జార్చుకున్న కాలచక్రంలో శూన్యం
నేర్చిన అక్షరం నక్షత్రాల్ని కోసి తెస్తుందని
మరణించే వరకు మనిషి విద్యార్ధేనని
అఙ్ణాన తిమిరాన వెలుగు జల్లుతూ
అక్షరాస్యత శాస్త్రీయ ప్రతిమ అంటూంది.

కామెంట్‌లు లేవు: