9, ఏప్రిల్ 2011, శనివారం

వైయస్ వివేకా గెలుపుపై మంచి ధీమాతో ఉన్నారు.

యవసాయ శాఖ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానందరెడ్డి తన వదిన విజయమ్మపై పులివెందుల శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సానుభూతి ఓటుతో పాటు అక్కడ వైయస్‌కు ఉన్న ప్రాబల్యం కారణంగా పలువురు విజయమ్మ గెలుపొందుతుందని చెబుతున్నారు. జగన్‌తో సై అన్న వివేకానందరెడ్డి తాను ఓడిపోతే ఏం చేస్తారు. దానికి ఆయనే కొన్ని టీవి ఇంటర్వ్యూలలో సమాధానం చెప్పారు. తాను పులివెందుల నియోజకవర్గంలో ఓడిపోతే సామాన్య కార్యకర్తగా నియోజకవర్గంలో పని చేస్తానని చెప్పారు. తాను ఎలాంటి మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్సీ పదవులు కాని ఆశించనని చెప్పారు.


పార్టీని వీడిన జగన్‌ను ఓడించడానికి కడప , పులివెందుల ఉప ఎన్నికలను కాంగ్రెసు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా అదే కుటుంబానికి చెందిన జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందను వదినపై పోటికి నిలిపి జగన్‌ను దెబ్బ కొట్టాలని చూస్తుంది. తాను ఓడిపోతే ఎలాంటి పదవులు ఆశించనని వివేకా చెప్పినప్పటికీ కాంగ్రెసు పార్టీ భవితవ్యం కోసం తనయుడిపైనే పోరు సల్పుతున్న వివేకా ఓడితే కాంగ్రెసు ఆయనకు పార్టీలో సరియైన ప్రాతినిధ్యం ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం. అంతేకాదు ఆయనపై కాంగ్రెసు పార్టీకి కూడా నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోందంట. ఆయన ఏ సమయంలో జగన్‌వైపు వెళతారనే అపనమ్మకంతో ఉన్నదంట పార్టీ. ఒకవేళ అదే జరిగితే తన తల్లిపైనే పోటీకి దిగిన చిన్నాన్నను జగన్ దగ్గరకు తీస్తారా అంటే అదీ కష్టమే.

అయితే వైయస్ వివేకా గెలుపుపై మంచి ధీమాతో ఉన్నారు. పులివెందుల ప్రజలు తనతో ఉన్నారని చెప్పారు. దివంగత తన అన్న బాటలో తాను పయనిస్తున్నట్టు చెప్పారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసును వీడాలని అనుకోలేదని అలాగే తాను కూడా అన్న బాటలోనే కాంగ్రెసు పార్టీలోనే ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం తనను నిర్లక్ష్యం చేసిందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడి వెళ్లినప్పుడు కూడా ఆయన ఇదే చెప్పారు. తాను జగన్‌తో వెళ్లేది లేదని చెప్పాడు. జగన్ పార్టీ ప్రకటించాక కూడా అదే చెప్పారు. అన్న బాటను వీడి జగన్ పార్టీలో చేరేది లేదని చెప్పారు. అన్న బాటలోనే కాంగ్రెసు అభివృద్ధికి పాటుపడుతూ కాంగ్రెసు సూచించిన చోట పోటీ చేస్తానని చెప్పారు.

అన్నట్టుగానే ఆయన వదిన విజయమ్మపై పులివెందులనుండి పోటీకి దిగారు. వివేకా కాంగ్రెసు పార్టీనుండే పోటీలోకి దిగినప్పటికీ ఆయన వెంట ఆయన కుటుంబం లేక పోవడం విశేషం. కేవలం ఆయన భార్య, కూతురు తప్పితే మిగిలిన కుటుంబ సభ్యులు, బంధువులు అంతా జగన్ వెంటే ఉన్నారు. దీంతో వివేకా తాను ఒంటరి అయినట్లుగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ తనకు నియోజకవర్గ ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: