9, ఏప్రిల్ 2011, శనివారం

పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలనే నందమూరి కుటుంబ సభ్యుల వ్యూహం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నందమూరి కుటుంబ సభ్యులు ఎసరు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు నుంచి లాక్కోవడానికి నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనం సారాంశం. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల్లో పెట్టడానికి ఆమె సోదరుడు హరికృష్ణ, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెర వెనక పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా పార్టీ రాజకీయాల్లో తలెత్తిన విభేదాల వెనక హరికృష్ణనే ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం.


చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమా మహేశ్వర రావుపై జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేయడం వెనక పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలనే నందమూరి కుటుంబ సభ్యుల వ్యూహం ఉందని చెబుతున్నారు. చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేయలేక ఉమా మహేశ్వర రావును టార్గెట్ చేసుకుని తమ కథ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు సినీ హీరో బాలకృష్ణ పరోక్ష మద్దతు లభిస్తున్నట్లు చెబుతున్నారు. తన కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు ఇచ్చి వివాహం చేయడంతో బాలకృష్ణ చంద్రబాబుకు వ్యతిరేకంగా తెర మీదికి రావడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.

చంద్రబాబుపై తిరుగుబాటుకు జరుగుతున్న వ్యూహంలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ నాయకురాలిగా, పాలనాదక్షురాలిగా పేరు గడించిన పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సోదరి పురంధేశ్వరి అంటే హరికృష్ణకు ఎనలేని అభిమానం. స్వర్గీయ ఎన్టీఆర్ వారసురాలిగా పురంధేశ్వరిని నిలబెట్టాలనేది నందమూరి కుటుంబ సభ్యుల ప్రయత్నంగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని తమ చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో తిరిగి పార్టీకి వైభవం కగలించాలని, తాను ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని పురంధేశ్వరి కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: