1, ఏప్రిల్ 2011, శుక్రవారం

రియల్ బూమ్ ఇంకా ఎంత ధర పలుకుతుందో!!!!!

తెలంగాణ విడిపోవడం ఖాయమని, దాని వల్ల సీమాంధ్ర రాజధాని విజయవాడ సమీపంలో రావచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. హనుమాన్ జంక్షన్‌కు, నూజివీడుకు మధ్య రాజధాని ఏర్పాటవుతోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీంతో విజయవాడ చుట్టుపక్కల భూములకు విపరీతంగా గిరాకీ పెరిగింది. భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీనిపై ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఎకరం ధర 20 నుంచి 60 లక్షల రూపాయలు పలుకుతోందని తెలుస్తోంది.


రాజధాని వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినట్లు తెలుస్తోంది. విజయనగరం పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యులు కొంత మంది పెద్ద యెత్తున భూములు కొనేసినట్లు టీవీ చానెల్ తెలిపింది. మైలవరం ప్రాంతంలోని భూములకు పెద్ద యెత్తున ధరలు పలుకుతున్నాయని అంటున్నారు. విజయవాడ చట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు చుక్కలను అంటుతున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ, దాని చుట్టుపక్కల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాజధాని ఊహాగానాలకు ఊతమిస్తోందని అంటున్నారు. విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ఈ పథకాల అమలు రాజధాని ఏర్పాటు కోసమేనని ప్రచారం సాగుతోంది

కామెంట్‌లు లేవు: