8, ఏప్రిల్ 2011, శుక్రవారం

కాంగ్రెసు, తెలుగుదేశం,వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమాయత్తమయ్యాయి.

కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సమాయత్తమయ్యాయి. పులివెందుల శాసనసభా స్థానానికి అభ్యర్థులను ఖరారు చేయడంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పెద్దగా ఆలోచన చేయలేదు. పులివెందులలో వైయస్ విజయమ్మపై కాంగ్రెసు అభ్యర్థిగా మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎం. రవీంద్రనాథ్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. అయితే, వైయస్ జగన్‌పై పోటీకి దించేందుకు సరైన అభ్యర్థులపైనే రెండు పార్టీలు కూడా తీవ్రంగా కసరత్తు చేశాయి.


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడప లోకసభ స్థానానికి పలువురు అభ్యర్థులను పరిశీలించి ఎట్టకేలకు మైసురా రెడ్డి పేరును ఖరారు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డికి, మైసురా రెడ్డికి మొదటి నుంచి పడదు. కాంగ్రెసులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాబల్యం పెరగడంతో మైసురా రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వైయస్ కుటుంబంతో మైసురాకు ఉన్న వైరాన్ని ఈ ఎన్నికలో వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకోవచ్చు. మైసురా రెడ్డి గతంలో కూడా కడప లోకసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

కాగా, కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఖరారు కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దఫాలు దఫాలుగా కసరత్తు చేస్తున్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పేరుతో పాటు పలువురి పేర్లను వారు గత రెండు మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. కానీ బుధవారం సాయంత్రం వరకు కూడా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. అయితే, ప్రస్తుతం వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెసులోకి వస్తున్న కందుల రాజమోహన్ రెడ్డిని వైయస్ జగన్‌పై కడప లోకసభ స్థానంలో పోటీకి పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కందుల రాజమోహన్ రెడ్డితో డిఎస్, కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం చర్చలు జరిపారు. మొత్తం మీద, కడపలో పోటీకి మూడు పార్టీల అభ్యర్థులు మోహరించినట్లే భావించాలి.

కామెంట్‌లు లేవు: