8, ఏప్రిల్ 2011, శుక్రవారం

జ 'గన్' ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఈ విషయం జగన్‌కు తెలుసు. అందుకే, ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనవి అని ఆయన చెబుతూనే ఉన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా జగన్ రాజకీయ భవిష్యత్తుకు తలుపులు మూసేయాలనే పట్టుదలతో కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ ఉప ఎన్నికలపై దృష్టి సారించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.


ముఖ్యంగా ఆయన కడప లోకసభ స్థానంపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీని సాధ్యమైనంత ఎక్కువగా బలహీనపరిచి, జగన్‌కు దీటుగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇందులో భాగంగానే కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానంద రెడ్డి సోదరులను తెలుగుదేశం నుంచి కాంగ్రెసులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కందుల రాజమోహన్ రెడ్డికి కడప లోకసభ టికెట్ ఇవ్వాలనేది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు.

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించి పోటీకి సిద్ధపడడంతో కాంగ్రెసు ఓట్లు చీలిపోతాయని, దాని ద్వారా లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహాన్ని దెబ్బ కొట్టి, జగన్‌పై ఆధిపత్యం సాధించడానికే కందుల బ్రదర్స్‌ను ముఖ్యమంత్రి కాంగ్రెసులోకి ఆహ్వానిస్తున్నారు.

కడప లోకసభ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంటున్న స్థితిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను చిత్తు చేసి, విజయం సాధించాలని జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగు ఉండదని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులు తన పార్టీలో పెద్ద యెత్తున చేరుతారని జగన్ భావిస్తున్నారు. ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయం కూడా ఆయనకు తెలుసు. దీంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఓడించేందుకు జగన్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

కామెంట్‌లు లేవు: