5, ఏప్రిల్ 2011, మంగళవారం

మళ్లీ అనుకూలిస్తే ఆంధ్రప్రదేశ్ నంచి పోటీ చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా!!??##$$

సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికల తర్వాత ఆమె వైయస్ జగన్ పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే, పార్లమెంటు సభ్యురాలిగా పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్నికలకు ముందే ఆమె వైయస్సార్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నాయకుడు అమర్‌ సింగ్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె తనకు అవకాశం ఉన్న పార్టీవైపు చూస్తున్నారు.


జయప్రద రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టాలని కూడా చాలా కాలం నుంచే అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటుకు ఎన్నికవుతూ వస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పని చేయాలనే తన కోరికను జయప్రద మరోసారి ఆదివారం వెల్లడించారు. ఆమె ఆదివారంనాడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకు అవకాశం వస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తానని ఆమె తన కోరికను వెల్లడించారు.

అప్పట్లో తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకూలంగా లేనందున ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. మళ్లీ అనుకూలిస్తే ఆంధ్రప్రదేశ్ నంచి పోటీ చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆమె చెప్పారు. ఆమె మాటలను బట్టి రాష్ట్ర రాజకీయాల వైపు ఆమె చూస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి తెలుగుదేశంలో చేరడం కన్నా వైయస్ జగన్ పార్టీలో చేరడం వల్ల తనకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆమె భావిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

కామెంట్‌లు లేవు: