5, ఏప్రిల్ 2011, మంగళవారం

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి.

కొందరిలో అన్నం తినకపోతే కడుపులో మంట, తింటే అజీర్తి వేధిస్తుంటాయి. మరికొందరిలో మలబద్దకం సమస్య ఏళ్ల పర్యంతం ఉంటుంది. ఇవి మొదట్లో చిన్న సమస్యలుగానే అనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారతాయి. అయితే వీటిని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జీర్ణ సంబంధ సమస్యలలో సాధారణంగా కనిపించే లక్షణాలు అజీర్తి, గ్యాస్, తేన్పులు, కడుపు నొప్పి, కడుపులో మంట, మలబద్దకం, విరేచనాలు. ఒక్కోసారి మలంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్దకం, బరువు తగ్గటం, ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి పనితీరు వల్ల కూడా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరిలో రోజువారి విరేచనాలు సాఫీగా జరగవు. దీనినే మలబద్దకం అంటారు. విరేచనం అయిన తరువాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం మలబద్దకం లక్షణమే.

కారణాలు
పీచుపదార్థాలు తీసుకోకపోవడం. సరిపడా నీరు తాగకపోవడం. కొన్ని రకాల మందులు వాడటం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం. ఆకుకూరలు, పండ్లు తీసుకోకపోవడం. తగిన శారీరక వ్యాయామం కొరవడటం.

నివారణా మార్గాలు
ప్రతిరోజు మూడు లీటర్ల నీటిని తాగడం. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మొలకెత్తిన ధాన్యాలు, క్యారెట్, కీరదోస,క్యాప్సికం, ముల్లంగి వంటి కూరగాయలు తీసుకోవడం చేయాలి. ఆయా సీజన్‌లలో దొరికే పండ్లను తప్పకుండా తినాలి. ముడి బియ్యం(దంపుడు బియ్యం) తీసుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. సమయానికి భోజనం, నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. యోగా, మెడిటేషన్ వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పైల్స్(హెమరాయిడ్స్)
మలాశయ ద్వారంలో వాచి ఉబ్బిన రక్తనాళాలు(సిరలు). ఇందులో ఇంటర్నల్ హెమరాయిడ్స్, ప్రొలాప్స్‌డ్ హెమరాయిడ్స్, ఎక్స్‌టర్నల్ హెమరాయిడ్స్ అని మూడు రకాలుంటాయి. మల విసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి కలుగజేసినపుడు సిరలలో రక్తసరఫరా పెరిగి ఉబ్బుతాయి. ఆ ఒత్తిడి మళ్లీ మళ్లీ పడినపుడు వాచిపోతాయి. సిరల నుంచి రక్తసరఫరా సరిగ్గా జరగనప్పుడు ఇవి విరేచనం సాఫీగా జరగకుండా అడ్డుపడతాయి. ఒత్తిడి కలగజేసినా, విరేచనాలు గట్టిగా అయినా ఒరుసుకుపోయి రక్తస్రావం జరుగుతుంది.

కారణాలు
అధిక బరువుతో బాధపడుతున్న వారిలో పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి వచ్చే అవకాశం. ఆల్కహాల్, టీ, సిగరెట్, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్ రావడానికి అవకాశం ఉంటుంది.

నివారణ
పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మల విసర్జన కోసం ఒత్తిడి పెట్టకూడదు. విరేచనాలు వస్తున్నట్లయితే ఆపకుండా వెంటనే వెళ్లాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫాస్ట్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు.

ట్రావెలర్స్ డయేరియా
ప్రయాణం చేసే వారిలో భోజనంలో, తాగే నీటిలో మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కాబట్టి ప్రయాణంలో ఉన్నప్పుడు కుళాయి నీరుతాగకుండా ఉండటం, ఐస్ ఉపయోగించిన నీరు తీసుకోకుండా ఉండటం చేయాలి. ఐస్ వేసిన చెరకు రసం, జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. పాలు, పాల సంబంధ పదార్థాలు తీసుకోకూడదు. శుభ్రంగా కడగని పండ్లు తినకూడదు. మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. రోడ్డుపైన, ఫుట్‌పాత్‌పైన అమ్మే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. మంచి కంపెనీ ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ట్రావెలర్స్ డయేరియా సమస్య తలెత్తకుండా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలను రక్త పరీక్షలు, మల పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారించుకోవచ్చు.

హోమియో వైద్యం
హోమియో వైద్యంలో రోగి జీవనవిధానం, శారీరక తత్వమును బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. పైల్స్ సమస్యకు నక్స్‌వామికా, అస్క్‌లస్‌హిప్, రెటానియా, కోలిన్‌సోనియ, గ్యాస్ సమస్యకు కార్బోవెజ్, చైన, లైకోపోడియం, మలబద్దకం సమస్యకు నక్స్‌వామికా, బైవోనియ వంటి మందులు బాగా పనిచేస్తాయి. ముందుగా సమస్యను నిర్ధారించుకుని వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కామెంట్‌లు లేవు: