10, ఏప్రిల్ 2011, ఆదివారం

బాలకృష్ణ ఎవరి వైపు ఉంటారనే ప్రశ్న ఉదయిస్తోంది

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, నందమూరి కుటుంబ సభ్యులకు మధ్య జరుగుతున్న పోరులో స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు, సినీ హీరో బాలకృష్ణ ఎవరి వైపు ఉంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నందమూరి కుటుంబ సభ్యులు సమరానికి సమాయత్తమయ్యారని వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేస్తూ బాలకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఏ విషయాన్నీ స్పష్టం చేయడం లేదు. మీడియాలో వస్తున్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయని, తనను వివాదంలోకి లాగవద్దని ఆయన అన్నారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పోరును ఆయన ఖండించలేదు. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తానని కూడా ఆయన స్పష్టం చేయలేదు. తాను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎవరి చేతుల్లో ఉన్నా తాను పార్టీ కోసం పనిచేస్తానని మాత్రమే ఆయన సూచన చేశారు.


చంద్రబాబుపై పోరుకు బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. ఈ స్థితిలో బాలకృష్ణ తన సోదరుడి వైపు ఉంటారా, తన బావ వైపు ఉంటారా అనేది తేలడం లేదు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు బాలయ్య తన కూతురు బ్రాహ్మణిని ఇచ్చి వివాహం చేశారు. దీంతో చంద్రబాబుకు దగ్గరగా ఉండాల్సిన అనివార్యతలో పడ్డారు. లోకేష్‌ను తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దుతున్నారనే సమాచారం నేపథ్యంలో హరికృష్ణ తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబును స్వర్గీయ ఎన్టీ రామారావు అల్లుడిగా, తమ ఆడపడుచు భర్తగా నందమూరి కుటుంబ సభ్యులు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ లోకేష్‌ను బాలకృష్ణ మినహా మిగతా కుటుంబ సభ్యులు అంగీకరించే అవకాశం లేదు. అందువల్ల తిరుగుబాటుకు నందమూరి కుటుంబ సభ్యులు సమాయత్తమవుతున్నట్లు, కేంద్ర మంత్రి పురంధేశ్వరి వారికి సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పార్టీని నందమూరి కుటుంబ సభ్యులు తమ చేతుల్లోకి తీసుకోవడానికి, చంద్రబాబు పట్టు వదలకుండా నిలబడడానికి చేసే ప్రయత్నాల్లో బాలకృష్ణ మౌన ప్రేక్షకుడిగానే ఉండిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరి భర్తగానే కాకుండా, తన కూతురునిచ్చిన వియ్యంకుడిగా చంద్రబాబును వ్యతిరేకించడం బాలకృష్ణకు ఇబ్బందిగా ఉండవచ్చు. పార్టీని నందమూరి కుటుంబ సభ్యులు, అంటే హరికృష్ణ తన చేతుల్లోకి తీసుకుంటే బాలకృష్ణ తర్వాత్తర్వాత మద్దతు ఇచ్చే అవకాశాలుంటాయని అంటున్నారు. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం బాలకృష్ణకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ పెడుతూ వస్తోంది. హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య జరిగే పోరులో మధ్యస్థంగా పార్టీ పగ్గాలు బాలకృష్ణ చేతికి రావచ్చునా అనేది కూడా ప్రధానమైందే.

కామెంట్‌లు లేవు: