కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిలో ఆత్మ విశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో అపజయం పాలైన తర్వాత అంతగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేకపోయారు. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయనలో ఆత్మవిశ్వాసం కొరవడినట్లు కనిపిస్తూ వచ్చారు. పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి వెనకాడారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీకి స్టార్ కాంపెయినర్ అయ్యారు.
ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన దూకుడును ప్రదర్శించారు. తన సహజశైలికి భిన్నంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఇప్పటి వరకు ఇతర పార్టీల నాయకులు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో చిరంజీవి ఉండేవారు. ఇప్పుడు ఆయన ఎదురు దాడికి దిగారు. ఆ ఎదురు దాడిని చూస్తుంటే ఆయనకు కాంగ్రెసు నాయకత్వం బలమైన విశ్వాసాన్నే కల్పించినట్లు చెప్పవచ్చు.
వైయస్ జగన్ అక్రమాస్తుల గురించి ఆయన తన ప్రచారంలో ప్రశ్నించారు. జగన్ అహంకారం వల్ల, అధికార దాహం వల్లనే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని విమర్సించారు. చంద్రబాబుపై గతంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీలోకి రావాల్సి వస్తుందని, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆధిపత్యం పెరిగితే అది చంద్రబాబుకు తప్పదని, చంద్రబాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చిరంజీవికి పడని విషయం. కానీ, ఆయన ప్రత్యర్థులను ఎదుర్కుని, కాంగ్రెసులో తానే సరైన నాయకుడిని అని చాటుకోవడానికి అది తప్పడం లేదని అంటున్నారు.
పనిలో పనిగా ఆయన తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తాము మద్దతు ఇవ్వాలని అనుకున్నామని, అది విలీనం దాకా సాగిందని ఆయన చెప్పుకున్నారు. చిరంజీవి చుట్టూ కాంగ్రెసు నాయకులు దడి కట్టడం కూడా ప్రచారంలో గమనించవచ్చు. అంత మంది తన వెంట వస్తున్నారనే భావన కూడా ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి