5, మే 2011, గురువారం

జగన్‌కు ఓటు వేయాలా నిర్ధారించుకోలేని స్థితిలో వోటర్లు ఉన్నారు.

ఉప ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ఈ సమయంలో కడప, పులివెందుల నియోజకవర్గాలలో ఆయా అభ్యర్థుల ప్రచార జోరు ఉధృతం ఉంది. అయితే ఆయా పార్టీల ప్రచారం కొనసాగుతుండగా పులివెందుల వోటర్లు మాత్రం పూర్తిగా డైలామాలో పడిపోయారు. గడిచిన ముప్పయ్యేళ్లుగా పులివెందుల నియోజకవర్గం వోటర్లు నయానో, భయానో, రిగ్గింగో ప్రతిపక్షాల వాదనలు ఏవైనా కాంగ్రెసుతో ఉన్నారు అనడం కంటే వైయస్ కుటుంబంతో ఉన్నారనే చెప్పవచ్చు. కడప లోకసభ విజయం, మెజార్టీ కూడా పులివెందుల నియోజకవర్గంపైనే ఆధారపడి ఉండేది. అయితే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం, జగన్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ స్థాపించడం, జగన్ బాబాయి వివేకానందరెడ్డి కాంగ్రెసు పార్టీలోనే కొనసాగడం, అనంతరం ఉప ఎన్నికలు రావడం అలా అలా జరిగిపోయాయి.

అయితే ఉప ఎన్నికలలో ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీలోనే ఉంటూ ప్రస్తుతం అన్న బాటలో నడుస్తూ తమకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న వివేకానందరెడ్డికి ఓటు వేయాలా లేక తండ్రి నుండి వారసత్వం కోరుతున్న జగన్‌కు ఓటు వేయాలా నిర్ధారించుకోలేని స్థితిలో వోటర్లు ఉన్నారు. ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబం కాంగ్రెసులోనే ఉంది. ఆ పార్టీలో ఉండే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఇప్పటికిప్పుడు జగన్ బయటకు వచ్చి పార్టీ పెట్టారు. ఇది కూడా వోటర్లను ఆలోచింప చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీగా జగన్, ఎమ్మెల్యేగా విజయమ్మ కొన్నాళ్లు ఉన్నప్పటికీ ప్రజల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ విషయం జగన్‌కు నెగిటివ్‌గా తయారయింది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో పులివెందులలోని దాదాపు సగం కాంగ్రెసు పార్టీ సంప్రదాయ వోటర్లలో సందిగ్ధత నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

అయితే జగన్ కంటే తమకు అందుబాటులో ఉన్న వివేకా వైపు వోటర్లు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే జగన్ కంటే వివేకా రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివేకా గెలిచి మంత్రి అయితే తమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కూడా వారు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇక జగన్ సానుభూతి కోసం విమర్శలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండగా వివేకా మాత్రం ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా గెలుపుపై విశ్వాసంతో ఉంది. పులివెందులలో ఉన్న కాంగ్రెసు ఓట్లు జగన్, వివేకాలకు చీలిపోతే తమ గెలుపు ఖాయమని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: