20, ఏప్రిల్ 2011, బుధవారం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది. మరో వైపు ఈ రెండు అగ్రకులాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికి బిసిలు ఏకమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆధిపత్యంలో తెలంగాణ ఉద్యమం సాగుతుండడం పట్ల రెడ్డి నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పైగా, కెసిఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ ఉద్యమ నేతలుగా ముందుకు వచ్చారు. కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు కూడా వారితోనే ఉంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని తమ నాయత్వంలోకి తీసుకోవడానికి రెడ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ని ముందుకు తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.


ఆదివారంనాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన జైపాల్ రెడ్డిపై, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై తెరాస కార్యకర్తలు కోడి గుడ్లు విసిరారు. తెలంగాణ ఉద్యమం పెరిగితే కెసిఆర్ కుటుంబ సభ్యులు, వెలమ కులానికి చెందిన వారే లబ్ధి పొందుతారనే ప్రచారాన్ని రెడ్లు చాప కింద నీరులా సాగిస్తున్నారు. తెలంగాణలో వెలమల జనాభా చాలా తక్కువ. రెడ్ల జనాభా వారికన్నా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆధిపత్యంలో కూడా వారిదే పైచేయి. అయితే, తెలంగాణ ఉద్యమం విషయంలో మాత్రం కెసిఆర్ హవా సాగుతోంది. రాజకీయంగా బలోపేతం కావడానికి కెసిఆర్ కోదండరామ్ నాయకత్వంలోని రాజకీయ జెఎసిని బాగా వాడుకున్నారు. అయితే, మిలియన్ మార్చ్ విషయంలో కోదండరామ్‌కు, కెసిఆర్‌కు మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్ జెఎసి స్థానంలో మరో వేదికను ఏర్పాటు చేయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

కెసిఆర్‌కు, కోదండరామ్‌కు మధ్య పొడసూపిన విభేదాల నేపథ్యంలో ఎస్ జైపాల్ రెడ్డి ముందుకు వచ్చినట్లు సమాచారం. కోదండరామ్ నాయకత్వంలో రెడ్డి నాయకులు పనిచేయడానికి సిద్ధపడాలనే సందేశాన్ని ఆయన ఇస్తున్నట్లు భావిస్తున్నారు. పైగా, జైపాల్ రెడ్డి కోదండరామ్‌ను ప్రశంసిస్తున్నారు కూడా. మిలియన్ మార్చ్ విజయవంతమైందని జైపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందువల్లనే తెరాస ఆ ఇద్దరిని లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు. కోదండరామ్ నాయకత్వంలోని జెఎసిని బలోపేతం చేయాలని జైపాల్ రెడ్డి భావిస్తున్నారట. కోదండరామ్‌ను ముందు పెట్టి రెడ్డి నాయకులను ఏకం చేయడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. జెఎసిలో కీలక పాత్ర వహించేందుకు తగిన రంగాన్ని జైపాల్ రెడ్డి సహకారంతో నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, రెడ్డి, వెలమ నాయకుల ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి బిసి నాయకులు మరో వైపు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ నాయకత్వంలో అన్ని పార్టీలకు చెందిన రెడ్డి నాయకులు పని చేయడానికి సిద్ధపడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డితో పాటు సిపిఐ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వంటి నాయకులకు కోదండరామ్‌తో కలిసి పనిచేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమం మే నెల నాటికి కీలక మలుపు తిరుగవచ్చునని అనుకుంటున్నారు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

telangana udyamam velama, reddi poru ga marindani maralani anukuntunnadi kamma valla pracharam anipistondi

Jai చెప్పారు...

What an absolute nonsense dreamt up by the casteist andhera clique!