18, మే 2011, బుధవారం

సూర్యనమస్కారం.. సమస్యలు దూరం

వేకువనే నిద్ర లేచి దినచర్య మొదలుపెడితే.. మానసికంగా, శారీరకంగా బోలెడు ప్రయోజనాలు. అలా లేచిన వెంటనే పనిలో పనిగా లేలేత భానుడికి నమస్కారాలు చేయాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నాయి.

సూర్యనమస్కారాలు చేయడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. కవాటాలకు రక్త సరఫరా చురుగ్గా ఉంటుంది. అలాగే రక్తంలో ప్రాణవాయువు శాతమూ సజావుగా సాగుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు.

అజీర్తి సమస్యలు ఉన్నవారు.. నిపుణుల సూచనలతో సూర్యనమస్కారాలు చేయాలి. దీనివల్ల ఎంతో మార్పు ఉంటుంది. అలాగే నాడీవ్యవస్థా చురుగ్గా పనిచేస్తుంది. శ్యాసకోస సమస్యలుంటే దూరమవుతాయి. ఒత్తిడి, మానసిక కుంగుబాటు వంటివి దూరమై తనువు, మనసు ఉత్తేజితమవుతాయి.


నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికీ ఇది చక్కని పరిష్కారం. ఇలాంటి వారు నిశబ్ద వాతావరణంలో సూర్యనమస్కారాలు చేయాలి. చాలా మార్పు కనిపిస్తుంది. బద్ధకం వదిలి రోజంతా చురుగ్గా ఉల్లాసంగా ఉండాలన్నా సరే.. దీనిని మించిన ప్రత్యామ్నాయం లేదు. చేస్తున్న పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత అలవడుతుంది.

వూబకాయం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఉదర కండరాలు దృఢమవుతాయి. పొట్ట చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. సూర్య కిరణాల ప్రభావంతో శరీరంలోని అధిక కెలొరీలు ఖర్చవుతాయి. కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. వెన్నెముక దృఢమవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. శరీరం తాజాదనాన్ని సంతరించుకున్న మార్పు ఇట్టే కనిపిస్తుంది.

నెలసరి సంబంధ సమస్యలతో బాధపడేవారు తరచూ వీటిని చేయడం మంచిది. అధ్యయనాల ప్రకారం.. యుక్తవయసు నుంచి సూర్యనమస్కారం చేయడం వల్ల భవిష్యత్‌లో ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను చాలామటుకు నివారించవచ్చు.

లేలేత, నులివెచ్చని సూర్యకిరణాలు ముఖాన్ని తాకితే చర్మానికి మేలు జరుగుతుంది. ముడతలు తొలగిపోతాయి.. వృద్ధాప్య చాయలు కనిపించవు. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు సమస్యను సైతం నివారించవచ్చు.

అయితే... వీటిని చేసేముందు.. వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

కామెంట్‌లు లేవు: