17, మే 2011, మంగళవారం

వైయస్ జగన్‌ను ఎదుర్కోగలరా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరా అనే అనుమానం కలుగుతోంది. వైయస్ జగన్ కాంగ్రెసుపైనా తెలుగుదేశం పైనా ప్రతీకారం తీర్చుకుని, తాను అధికారంలోకి రావడానికి ఎంత శ్రమకైనా ఓర్చుకునేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ప్రజల్లోకి వివిధ రూపాల్లో విస్తృతంగా వెళ్లడానికి ఆయన సిద్ధపడ్డారు. కడప ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన దాదాపు నెల రోజుల పాటు తెంపు లేకుండా తిరిగారు. తాను ఎలాగూ గెలుస్తాననే అతి విశ్వాసంతో గానీ ఇతర పార్టీల బలహీనత తనను గెలిపిస్తుందనే నమ్మకంతో గానీ నిర్లక్ష్యం చేయకుండా తిరిగారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన రైతు సమస్యలపై గుంటూరులో 48 గంటల పాటు దీక్షకు దిగారు. వైయస్ జగన్ తన దీక్ష విషయాన్ని ప్రకటించగానే చంద్రబాబు గుంటూరు జిల్లాలో రైతు సమస్యలపై పర్యటించారు. జగన్ దీక్ష ముందు అది పని చేసే పరిస్థితి లేదని అర్థమవుతోంది. శారీరక శక్తితో పాటు లక్ష్య సాధన పట్ల దీక్ష ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఆ శక్తి అటు కిరణ్ కుమార్ రెడ్డికి గానీ ఇటు చంద్రబాబుకి గానీ ఉన్నట్లు లేదు. జగన్‌లాంటి పట్టుదల, వయస్సు గల నాయకుడు మాత్రమే అయనకు దీటు రాగలడని అనిపిస్తోంది.

గుంటూరు రైతు దీక్ష తర్వాత జగన్ విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ప్రజల్లోకి వెళ్లే విషయంలో జగన్ ఎక్కడా విరామం ఇవ్వడం లేదు. అలా విరామం లేకండా చేపడుతున్న కార్యక్రమాల వల్ల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కంగు తినే పరిస్థితే ఉంది. జగన్ ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతుందనే నమ్మకంతో తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు ఉన్నట్లున్నారు. కానీ, ఆ ప్రాబల్యం, ఆదరణ తగ్గకుండా ఆయన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.

కామెంట్‌లు లేవు: