28, మే 2011, శనివారం

బాబు స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడేనా?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా అనేది అనుమానమే. ఆయన ఎన్టీ రామారావు పేరును వాడుకున్నప్పటికీ వారసత్వాన్ని మాత్రం కొనసాగించడం లేదని అందరూ చెప్పే మాటే. ఎన్టీ రామారావు బొమ్మ వేరేవారి సొంతం కాకుండా జాగ్రత్త పడుతూ నారా వారసత్వాన్ని స్థాపించడమే చంద్రబాబు లక్ష్యమని చెబుతున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌కు తన వారసత్వాన్ని అందించాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా పార్టీ మహానాడు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని మాత్రం చంద్రబాబు తప్పకుండా పాటిస్తున్నారు.

ఎన్టీ రామారావుకున్న తెగువ, సూటిదనం చంద్రబాబుకు లేవు. పైగా, తన చేతిలోకి వచ్చిన తర్వాత పార్టీ స్వరూప స్వభావాలనే మార్చేశారు. ఇతరులు చెప్పే మాటను వినే అలవాటు ఎన్టీఆర్‌కు ఉంది. ఎవరైనా చెప్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే దాన్ని ఆచరణలో పెట్టేవారు. కాంగ్రెసుకు బద్ద వ్యతిరేకిగా వ్యవహరించారు. అందువల్ల ఆయన మొండివాడిగా కూడా ముద్ర పడ్డారు. ప్రజల మేలు తప్ప మరోటి ఆయనకు తట్టేది కాదు. పైగా, ప్రజలకు మేలు జరుగుతుందంటే నిబంధనలను కూడా పక్కన పెట్టేవారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారు. పార్టీపరంగా తీసుకున్న నిర్ణయానికి నష్టమైనా, కష్టమైనా కట్టుబడి ఉండేవారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సంక్షేమ దిశ నుంచి అభివృద్ధి దిశకు, అదీ పెట్టుబడీదారి దిశకు మళ్లించారు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. వ్యవసాయం దండుగ వంటి మాటలు మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ స్థానికేతరులకు అన్యాయం జరిగిందనే విషయం బయటకు వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దడానికి 610 జీవోను విడుదల చేశారు. కానీ దాన్ని చంద్రబాబు అమలు చేయలేకపోయారు. అంతేకాదు, రాజకీయ ప్రయోజనం కోసం తీసుకున్న తెలంగాణ అనుకూల వైఖరికి ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ఎన్టీఆర్ ఉన్నప్పటి తెలుగుదేశం కాదనేది అందరికీ తెలిసిన విషయమే.

కామెంట్‌లు లేవు: