13, మే 2011, శుక్రవారం

కడప కింగ్ ఆవినీతి గెలిచింది

కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలు పలు ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఉప ఎన్నికలు వైయస్ జగన్ చెప్పినట్లు రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది పలుకుతాయా అనే ప్రశ్న అత్యంత ప్రధానంగా ముందుకు వస్తుంది. భారీ మెజారిటీతో వైయస్ జగన్, వైయస్ విజయమ్మ విజయం ఏ విధమైన సంకేతాలను అందిస్తోందనేది ప్రధానాంశం. సాధారమైన మెజారిటీతో వీరిద్దరు గెలిచి ఉంటే ఈ ప్రశ్నలకు అవకాశం ఉండేది కాదు. సెంటిమెంటు వల్ల విజయం సాధించారని చెప్పి తప్పించుకోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

వైయస్సార్‌కు లభించిన దాని కన్నా ఎక్కువ మెజారిటీ విజయమ్మకు, జగన్‌కు లభించింది. వైయస్సార్ మరణం వల్ల పెల్లుబుకిన సానుభూతి ఎన్నికల్లో ఏదో మేరకు పని చేసిందని అంగీకరించక తప్పదు. కానీ, అంతకు మించిన సంకేతాన్ని ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. వైయస్సార్ రాజకీయ వారసత్వాన్ని వైయస్ జగన్‌కు కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారనే విషయాన్ని కూడా చెప్పినట్లు విశ్లేషిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో ఉండడం వల్లనే సంక్షేమ పథకాలను అమలు చేశారని, అవన్నీ కాంగ్రెసు పథకాలేనని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని కూడా అర్థమవుతోంది. కాంగ్రెసులో ఉన్నప్పటికీ ఆ పథకాలను రాజశేఖర రెడ్డి కాబట్టే అమలు చేశారని, మరో ముఖ్యమంత్రి అయితే అమలు చేసి ఉండేవారు కారని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పవచ్చు.

జనాదరణ లేని నాయకులను ముఖ్యమంత్రులుగా నిలబెట్టే కాంగ్రెసు అధిష్టానం వైఖరిపై నిరసనగా కూడా ఫలితాలను చూస్తున్నారు. పైగా, ఓ కొడుకును, ఓ తల్లిని ఒంటరి చేసి ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్ జగన్ తన ప్రచారంలో చెప్పిన మాట బాగానే పని చేసిందని కూడా అంటున్నారు. అలాగే, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తనను ఓడించడానికి కుమ్మక్కయ్యాయని జగన్ వర్గం చేసిన విమర్శ కూడా ప్రజల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. వైయస్ జగన్ అవినీతిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పవచ్చు. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెసు నాయకులను కూడా ప్రజలు తిప్పి కొట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వ్యక్తమైన ప్రజాభిప్రాయమే వ్యక్తం కావచ్చుననే ఆందోళన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను తీవ్ర మథనానికి గురి చేసే అవకాశాలున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా చూపడానికి జగన్ వర్గం వెనకాడదనేది నిజం. ఏమైనా, వైయస్ జగన్‌కు ఉప ఎన్నికల ఫలితాలు ఎనలేని మనో ధైర్యాన్నిచ్చాయని చెప్పక తప్పదు.

కామెంట్‌లు లేవు: