4, జూన్ 2011, శనివారం

ఇప్పుడు పరీక్ష వైయస్ జగన్‌కే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గురి చూసి కొట్టిన బంతి తిరిగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోర్టులోనే పడింది. ఇప్పుడు పరీక్ష వైయస్ జగన్‌కే గానీ, చంద్రబాబు నాయుడికో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికో కాదు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించడం లేదని వైయస్ జగన్ పదే పదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రతిపాదించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెబుతూ వచ్చారు. మధ్యంతర ఎన్నికలకు భయపడి చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోరని ఆయన అనుకుని ఆ రకంగా మాట్లాడుతూ వచ్చి ఉంటారు. కానీ, చంద్రబాబు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేశారు.

అనూహ్యంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ముందుకు తెచ్చి వైయస్ జగన్‌కు పరీక్ష పెట్టారు. ఇప్పుడు జగన్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అనివార్యతలో పడ్డారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువే ఉన్నారని అంటూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అసలు పరీక్ష ఎదురవుతోంది. చంద్రబాబు అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని వెలికి తీయడంతో జగన్ తన జెరూసలేం పర్యటనను రద్దు చేసుకున్నారు. తమ పార్టీ ముఖ్య నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకోవడంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే జగన్‌కు కనీసం 40 మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. అంత మంది శాసనసభ్యులను జగన్ చీల్చగలుగుతారా అనేది అనుమానమే.

పార్టీ నిర్మాణంపై, సంస్థాగత వ్యవహారాలపై జగన్ దృష్టి పెట్టిన సందర్భంలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దృష్టి మళ్లించారు. వైయస్ జగన్ వెంట 27 మంది శానససభ్యుల దాకా ఉన్నట్లు ఇప్పటి వరకు అంచనాలు సాగుతూ వచ్చాయి. వీరిలో 25 మంది దాకా కాంగ్రెసు ఎమ్మెలున్నారని చెబుతూ వచ్చారు. కానీ, ఆ బలం కూడా ఉంటుందా, ఉండదా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 10 మది శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ పది మంది కచ్చితంగా జగన్ వైపు ఉండే అవకాశాలున్నాయని అనుకోవచ్చు.

తమకు సరైన బలం లేదని గ్రహించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పుడు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలనే అంశాన్ని ముందుకు తెచ్చారు. ఆత్మప్రబోధానుసారం ఓటు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని వారు కాంగ్రెసు శాసనసభ్యులకు పిలుపునిస్తున్నారు. ఇంకా మూడేళ్ల కాలవ్యవధి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ముందుకు వస్తారా అనేది అనుమానమే. తన దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తాను కన్నెర్ర చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెబుతూ వచ్చిన వైయస్ జగన్‌కు ఇది అసలు సిసలైన పరీక్ష అనడంలో సందేహం లేదు.

కామెంట్‌లు లేవు: