5, జూన్ 2011, ఆదివారం

నెమ్మదినెమ్మదిగా ఉప్పు వాడకాన్ని తగ్గించండి.

వండుకుని తినేందుకు టైం ఉండడం లేదంటూ ఫాస్ట్‌ఫుడ్ మీద ఆధారపడుతున్నారు ఎక్కువమంది. టైం వృథా కాకుండా ఉంటుంది. అంతవరకు ఒకె. కాని ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఫాస్ట్‌ఫుడ్‌ను రోజూ తింటే ఎముకల పైన ఉండే త్వచం పలుచబడడమే కాకుండా ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. మొత్తం మీద ఎముకలు బలహీనంగా తయారవుతాయన్నమాట. అది సరే కాని ఫాస్ట్‌ఫుడ్‌కి దీనికి సంబంధం ఏముందనిపిస్తోందా? ఫాస్ట్‌ఫుడ్ నిల్వ ఉండడం కోసం ఎక్కువ ఉప్పు వినియోగిస్తుంటారు. దాంతో శరీరంలోకి ఎక్కువ ఉప్పు చేరిపోయి కాల్షియం బయటకు పంపబడుతుంది. అందుకనే ఉప్పు తక్కువగా తినమనేది. ముఖ్యంగా ఆడవాళ్లు తక్కువ ఉప్పు తీసుకోవాలి. లేకపోతే నెలసరికి వారం ముందు శరీరంలోకి నీరు చేరి ఉబ్బినట్టు తయారవుతారు. అందుకే ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించాలి.

- ప్యాకేజి ఆహారాన్ని కొనేప్పుడు ప్యాకెట్ పైన రాసి ఉన్న పోషకవిలువల సమాచారాన్ని చదవాలి. తక్కువ ఉప్పు ఉన్న పదార్ధాలనే కొనాలి.

-వంటల్లో ఉప్పు తగ్గించేయాలి. తినేటప్పుడు ఉప్పును ఆహారపదార్ధాలపైన చల్లుకునే అలవాటును మానుకోవాలి.

-బంగాళాదుంపల చిప్స్ వంటి స్నాక్స్ మానేయాలి. అలాగే చీజ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ ఈట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

-వంట సాస్ వాడకం తగ్గించాలి. సీజనింగ్ కోసం వాడే సాయ్, చిల్లీ, సలాడ్ డ్రస్సింగ్, మస్టర్డ్ సాస్ వంటి వాటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాటిని వంట గదికి దూరంగా ఉంచాలి.

-పళ్లు, కాయగూరలు వంటి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. అరటిపండ్లు, పాలకూర, గెనుసుగడ్డ (స్వీట్ పొటాటో), పప్పు ధాన్యాలు, సోయా, చిక్కుడు గింజలు, రాజ్మా వంటివి ఆహారంలో చేర్చితే సోడియం వల్ల కలిగే రక్తపీడన లోపాన్ని అధిగమించవచ్చు.

ఏమీ తినకుండా మూతికట్టుకు కూర్చుంటే ఎలా? బతికిన కొన్నాళ్లు జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేం దొరికిందంతా తింటాం. మాకివన్నీ చెప్పొద్దు అనే వాళ్లు కూడా శరీరంలోకి అధికంగా చేరే సోడియంను తగ్గించుకోవచ్చు. పచ్చళ్లు, పాపడ్లు, చట్నీలు తినకుండా ఉండలేం అనే వాళ్లు కూడా ఉప్పును దూరంగా ఉంచొచ్చు. అందుకు ఏం చేయాలంటే...

- ఒక్కో మీల్‌కి నాలుగు నుంచి ఆరు గంటల ఖాళీ ఉండాలి.

- ఆ ఖాళీ సమయంలో నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు, రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు లేదా ఒక గ్లాసు టొమాటో రసం తాగాలి. టొమాటో రసంలో ఉప్పు వేయకూడదు. ఇలా చేస్తే శరీరంలోకి చేరిన అదనపు సోడియంను వేరు చేసే అవకాశం ఉంటుంది.

-రోజూ 30 నిమిషాల బ్రిస్క్ వాక్ చేయాలి. ఇలాచేస్తే శరీరంలో అదనంగా ఉన్న సోడియం స్వేదం రూపంలో బయటకుపోతుంది.

- ఉప్పు ఎక్కువగా ఉన్న ఒక మీల్ తరువాత తీసుకునే రెండవ మీల్‌లో కీరదోసకాయ ముక్కలు, టొమాటోలు, అర చెక్క యాపిల్, కారెట్ తురుము, దానిమ్మ గింజలు సగం వేసిన సలాడ్‌ను లాగించండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సలాడ్‌లో కూడా ఉప్పు కలపొద్దు.

- ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదినెమ్మదిగా ఉప్పు వాడకాన్ని తగ్గించండి. ఉప్పు తగ్గించిన పదార్ధాలను తినేందుకు రెండు నుంచి మూడు వారాలు రుచిమొగ్గలు అలవాటుపడేందుకు టైం పడుతుంది. ఆ తరువాత నుంచి తక్కువ ఉప్పు ఉన్న ఆహారపు రుచిని ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు.

1 కామెంట్‌:

vanajavanamali చెప్పారు...

valueble post.. Thank you..