30, నవంబర్ 2011, బుధవారం

మోహం, చపలత్వాల భ్రమ, భ్రాంతి

ఓ గురుకులంలో శిష్య పరమాణువు లందరూ విశ్రాంతి సమయంలో గుమిగూడి వాడి వేడిగా చర్చించుకుంటూ, తర్కించుకుంటూ, వాదించుకుంటూవున్నారు. ఆ వాదించుకునే విషయమేమిటంటే ప్రపంచంలోని ఈతి బాధలకు కారణమేమిటా అని.

కొందరు మనిషిలో స్వార్థం అన్నారు.
ఇంకొందరు భ్రమ, భ్రాంతి అంటున్నారు.
వేరొకరు మోహం, చపలత్వాల గురించి చెబుతున్నారు.
మరికొందరు సత్తుకీ అసత్తుకీ తేడా తెలియకుండా పోవడమే అని వివరిస్తున్నారు.

వారిలో వారు గుంపులుగా తయారయ్యి ఎవరికి నచ్చిన వాదనను బలపరుస్తూ మాట్లాడుతున్నారు.

చివరికి ఎటూ తేలక, ఏకాభిప్రాయానికి రాలేక గురువుగారికి విన్నవించారు. అందరి వాదనలూ ప్రశాంతంగా విన్న గురువు గారు ఇలా తేల్చారు.

" అన్ని బాధలకు మూల కారణం మనిషి కదలకుండా ప్రశాంతంగా మౌనంగా వుండలేకపోవడమే "

కామెంట్‌లు లేవు: