నన్ను నాకు నగ్నంగా చూపే పగటి వెలుగుకంటే
నన్ను నాలా ఉండనిస్తూ భద్రతనిచ్చే చిక్కటి చీకటి నాకు నచ్చుతుంది.
నాలో ఘోషని నిర్లక్ష్యం చేసే వెలుగుకు ఏ కొసైనా నా చింత లేదు.
తన నిశ్శబ్దంలో నన్ను ఐక్యం చేసుకునే చీకటి నిశ్చింతలో నాకు స్వాంతన దొరుకుతుంది.
తన కపట మాటలతో చేతలతో మభ్యపెట్టే, రోజు ఆడంబరంకంటే
చంటిపాపలా నన్ను లాలించే రేయిలోని ఆప్యాయత నన్ను నెగ్గుతుంది.
రెండు నిమిషాలు కూడా కుదురుండనివ్వని పగటి ఆర్భాటంకంటే
శాంతం కూర్చుని నా గాధలన్నీ ఓపికగా వినే యామిని స్నేహం ఆహ్లాదంగా ఉంది.
కాదని, కుదరదని, జరగదని అపహాస్యం చేసే వెలుగు రంగులకంటే
'నీకు నచ్చిన రంగులతో నన్ను నింపుకో' అని చీకటిచ్చే చనువు నన్ను కదిలిస్తుంది.
నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.
జారిపోతున్న నాకు ఊతం అందించి, ఒడి పరిచి బడలిక తీరుస్తుంది రాత్రి.
పగటి వెలుగులో చీకట్లు ముసిరేస్తున్నాయి. చీకట్లో వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.
రేయి పాడిన పాటలలోని రాగాలు, ఉషోదయంతో కూనిరాగలై మాయమైపోతున్నాయి.
రణగొణగా అట్టహాసంగా సాగుతూ, ఎన్ని అపహాస్యాలు చేసి ఎంత కౄరంగా హింసించినా
ఎదిగే ప్రతి పొద్దును ఊపిరి బిగపట్టి ఓర్పుతో దాటేస్తున్నది ఎందుకంటే......
నిరాడంబరమైన నిశి పరిచే చల్లని ఒడిలో వెచ్చని ఊహలతో
నిశ్చింతగా నిదురించే సమయం తిరిగి నాదౌతుందన్న నమ్మకంతో......
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి