6, మే 2011, శుక్రవారం

కడప మహిళా నేతలు ప్రచారం

పులివెందుల, కడప ఉప ఎన్నికల బరిలో అధినేతలకు ధీటుగా ఆయా పార్టీల మహిళా నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నుండి మహిళా నేతలు జిల్లాలోనే తిష్ట వేసి తమ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాప్తాడా శాసనసభ్యురాలు పరిటాల సునీత, తెలుగు మహిలా అధ్యక్షురాలు శోభా హైమావతి, కేంద్రమంత్రి పురందేశ్వరి, రోజా, షర్మిళ, లక్ష్మీపార్వతి తదితరులు ధాటిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైయస్ వివేకానందరెడ్డి గెలుపు కోసం ఆయన కూతురు, మరికొంతమంది కాంగ్రెసు మహిళా నేతలు పులివెందుల ప్రచారానికి పరిమితం అయ్యారు.

దివంగత పరిటాల రవీంద్ర సతీమణి, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతది అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు, పరిటాల అభిమానులు భారీగా ఉన్న గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తుంది. అభిమానాన్ని ఓటుగా మలుచుకోగలుగుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పరిటాల సునీత ప్రచారానికి మిగతా వారి కంటే అనూహ్య స్పందన వస్తుంది. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైసూరారెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఆమె పరిటాల అభిమానులను, ప్రచారాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రజలను కోరుతోంది. సునీత ప్రచారం చేస్తున్న గ్రామాలలో ప్రజా స్పందన చూసిన టిడిపి కార్యకర్తలు మంచి ఉత్సాహంతో కనిపిస్తున్నారంట. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కడప జిల్లా పార్టీ అధ్యక్షురాలు కుసుమకుమారితో పాటు పలువురు మహిళా నేతలు ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. వీరు జగన్ అవినీతిపై, కాంగ్రెసు అభ్యర్థులపైన కాకుండా టిడిపి గెలిస్తే ఏం చేస్తుంది, ఎందుకు ఓటెయ్యాలో చెప్పడంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు సాధ్యమైనంతగా దూరంగా ఉంటున్నారు.

ఇక వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ తరఫున రోజా, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతీ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అయితే వీరు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పై తీవ్రంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం విశేషం. అయితే రోజా ప్రచారానికి ప్రజలు భారీగా వస్తున్నప్పటికీ లక్ష్మీపార్వతి ప్రచారానికి మాత్రం అంతగా ఆధరణ కనిపించడం లేదని తెలుస్తోంది. ఇక జగన్ చెల్లెలు షర్మిళ కూడా తల్లి, అన్నయ్య విజయానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. తన అన్నయ్యను కుట్రతో కాంగ్రెసు నుండి బయటకు పంపించారని వోటర్లను నమ్మించడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ప్రచార తీరు పూర్తిగా సానుభూతి కలిగించేలా ఉంటోంది. ఇక దివంగత ముఖ్యమంత్రి వైయస్ సతీమణి ఎలాగూ అభ్యర్థి కాబట్టి ఆమె పులివెందులలో గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తోంది. అయితే వైయస్ ఉన్నప్పుడు ఇంటిని విడిచి బయటకు రాని విజయమ్మ, షర్మిళాలను మాత్రం జగన్‌ తన స్వార్థం కోసం మండుటెండలో వారిని కష్ట పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక కాంగ్రెసు తరఫున ప్రముఖంగా ఎవరూ లేక పోయినప్పటికీ కేంద్ర మంత్రి పురందేశ్వరి బుధవారం పులివెందులలో వైయస్ వివేకా అభ్యర్థన మేరకు ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె కూడా జగన్‌పై విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరో వైపు వివేకానంద భార్య, కూతురు కూడా పులివెందుల నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ వివేకానందకు వోటేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే వారు కాంగ్రెసు కార్యకర్తలుగా కాకుండా వివేకా కుటుంబ సభ్యులుగా ప్రచారం చేస్తుండటం విశేషం.

కామెంట్‌లు లేవు: