30, మార్చి 2011, బుధవారం

ఈ 30 ఏళ్లలో తెలుగుదేశం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి.

తెలుగుదేశం పార్టీ 29 ఏళ్లు పూర్తి చేసుకుని 30 ఏళ్ల పడిలో అడుగు పెట్టింది. ఎన్‌టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు. ఈ 30 ఏళ్లలో తెలుగుదేశం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. పుట్టిననాటి లక్షణాలు, లక్ష్యాలు పార్టీకి ఏ మాత్రం లేవు. ప్రాథమిక లక్ష్యాలను కూడా తన చేతిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వదిలేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు ప్రధాన నినాదం. దాని గురించే తాము కూడా పాటుపడుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబుకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏ తెలుగు ప్రజల ఆత్మగౌరవమని తెలంగాణ ప్రజలు ప్రశ్నించేంతగా పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో ఎన్టీ రామారావుకు ఎంతగా ఆదరణ ఉండేదో చంద్రబాబుకు అంతగా ఆదరణ తగ్గిపోయింది.


తెలంగాణ ఉద్యమం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో కూకటివేళ్లతో పెకలించే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీ రామారావు తెలుగుదేశం ద్వారా తెలంగాణలోని బిసిలు, ఎస్సీలు, ముఖ్యంగా యువకులు రాజకీయాల్లో అడుగు పెట్టారు. రాజకీయానుభవం లేని పలువురు విద్యావంతులైన యువకులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. కొత్తరక్తం తెలుగుదేశంలోకి ఇప్పుడు రావడం లేదు. తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆ పాత్ర నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమం వల్ల తెలుగుదేశం నష్టపోవడమే కాకుండా కొత్తగా వచ్చే వారు లేకుండా పోయారు. ఈ విషయాన్ని అలా పక్కన పెడితే సీమాంధ్రలోనూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వారు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ నుంచే కొత్తగా వచ్చే రాజకీయ పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఇంతకు ముందు చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే, ఇప్పుడు వైయస్ జగన్ పార్టీలోకి వెళ్తున్నారు. ఎన్టీ రామారావు అందించిన స్ఫూర్తిని రాజకీయ శ్రేణులకు, ప్రజలకు అందించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే, తెలుగుదేశం పార్టీకి ప్రాణ వాయువుగా పనిచేస్తూ వచ్చిన చాలా ప్రజా సంక్షేమ పథకాలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారు. కొన్ని పథకాల రూపురేఖలు మార్చేశారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ వ్యవస్థను ఆయన నమ్ముకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడపాలనే ఉద్దేశంతో కాకుండా తాను చెప్పినట్లుగా, తన విధానాలకు అనుగుణంగా ప్రజలు మారాలనే విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. ఇందులో భాగంగానే ఆయన వ్యవసాయం దండుగ అని, మానవ శాస్త్రాలు చదవడం అనవసరమని కొత్త సూత్రాలను ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో, పునాది స్థాయిలో చంద్రబాబు మద్దతును కోల్పోతూ వచ్చారు. ఇక్కడే, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాపులు కదిపి గ్రామీణ, పేద వర్గాల మద్దతును సంపాదించుకున్నారు. దీంతో 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. తొమ్మిదేళ్ల పాటు అందించిన పాలన వల్ల చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారు. దాంతో 2009 ఎన్నికల్లో ప్రజలు ఆయనను విశ్వసించలేకపోయారు. దానివల్ల అధికారం మళ్లీ కాంగ్రెసుకే దక్కింది.

అంతేకాకుండా, చంద్రబాబు తాను చెప్పిందే అందరూ వినాలనే వైఖరిని అవలంబిస్తుండడం వల్ల సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. పార్టీ నాయకులు చంద్రబాబు చెప్పింది వినడం లేదా పక్కకు జరగడం అనే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. వారి సలహాలకు, వారి అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ ఉండడం లేదు. ఎన్టీ రామారావు చండశాసనుడిలా కనిపించినా, ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మేట్లు చెప్తే వినేవారు. తన వైఖరిని మార్చుకోవడానికి కూడా సిద్ధపడేవారు. ఈ లక్షణం చంద్రబాబులో లేదు. మొత్తంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగానూ పోలిక లేదు. పేరుకు మాత్రమే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీగా మిగిలిపోయింది.

కామెంట్‌లు లేవు: