30, మార్చి 2011, బుధవారం

ఇదండీ సామాన్య ప్రజలకు, దేశాన్ని నడపాల్సిన రాజకీయ నాయకులకు ఉన్న తేడా!

ఒకానొక రోజున ఒక పూల కొట్టాయన క్షవరం చేయించుకోవటానికి మంగలి కొట్టుకు వెళ్ళాడట. సరే వెళ్ళిన పని అయినాక, డబ్బులు ఎంత ఇవ్వాలి అని ఆయన అడగ్గా, మంగలిగారు, "మీ దగ్గర డబ్బులు తీసుకొను, నేను ప్రస్తుతం ఈ వారం అంతా సోషల్ సర్వీస్ చేస్తున్నాను!" అవటా అనేసాడుట. ఆ పూల కొట్టాయన చాలా సంతోషించి వెళ్ళిపోయాడట.

మర్నాడు కొట్టు తెరవబోయిన మంగాలాయనకు, కొట్టు బయట ఒక డజను చక్కటి గులాబీ పూలు చక్కగా అమర్చి కనబడ్డాయట, వాటితోపాటుగా, పూలకోట్టాయన పంపిన "ధన్యవాదాలు" కార్డు కూడ ఉన్నదట.

మర్నాడు మంగాలాయన తన షాపు తెరిచాడు, ఆ రోజున ఒక పోలీసాయన క్షవరానికి వచ్చాడు, అయనకి కూడ మంగాలాయన డబ్బులు తీసుకోలేదు. పోలీసాయన చాలా సంతోషించి వెళ్ళిపోయాడు. మర్నాడు మంగాలాయన షాపు తెరిచేప్పటికి బయట చక్కటి తినుబండారాలు షాపు బయట ఆయనకోసం పోలీసాయన పంపినవి సిద్ధంగా ఉన్నాయట.

ఈరోజు ఎవరొస్తారో కదా అనుకుంటూ ఉండగా, ఒక రాజకీయ నాయకుడు క్షవరానికి వచ్చాడు. పని అయినాక , అయనకి కూడ మంగాలాయన డబ్బులు తీసుకోను, నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను అనేశాడు. ఆ రాజకీయ నాయకుడు కండువా దిద్దుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు.

మర్నాడు మంగాలాయన కొంచెం తొందరగానే వెళ్ళాడు షాపు తెరవటానికి, ఇవ్వాళ ఏమి ఆశ్చర్యం చూడాలో అనుకుంటూ. కానీ షాపు ఇంకా తెరవకుండానే, ఓ పాతిక మంది రాజకీయ నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ షాపు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారుట.

మంగాలాయన అక్కడకు వెళ్లి, "బాబూ, ఏమిటి మీరంతా ఇలా!!?" అన్నాడుట వాళ్ళందరినీ రోజూ పేపర్లో చూస్తున్న ఫొటోలతో గుర్తించి. అప్పటిదాకా ఒకరినొకరు తోసుకుంటూ తిట్టుకుంటున్న వాళ్ళంతా, ఏక కంఠంతో, అస్సలు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారా అన్న భ్రమ కలిగేట్టుగా, "మా సోదరుడు చెప్పాడు, ఇక్కడ ఉచితంగా క్షవరం చేస్తారుటగా, అందుకే వచ్చాం" అన్నారుట నెత్తిమీద టోపీలు వగైరాలు తీస్తూ. ఇదండీ సామాన్య ప్రజలకు, దేశాన్ని నడపాల్సిన రాజకీయ నాయకులకు ఉన్న తేడా!

కామెంట్‌లు లేవు: