మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసం కేసులో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కె.తారక రామారావులు గత పది రోజులుగా పరారీలో ఉన్నారు. అవును ఇది పచ్చినిజం. అదేంటి నిత్యం వీరు ఏదో ఒక సమావేశంలో పాల్గొంటూ ప్రజల మధ్యే ఉంటున్నారు కదా.. పరారీలో ఉండటమేంటి అన్న ధర్మ సందేహం సగటు మనిషికెవరికైనా రావచ్చు. అయితే పోలీసులకు మాత్రం అలాంటి సందేహం రాలేదు. నవ్విపోదురుగాక మాకేంటి.. అన్నట్లుగా విధ్వంసం కేసులో ఆ నలుగురూ పరారీలో ఉన్నారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విధ్వంసం దృశ్యాలున్న టెలివిజన్ చానల్స్ ఫుటేజీ ఆధారంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన 58 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ నలుగురి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతోపాటు అనుమతి లేకున్నా ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ తదితరులపై కేసులు నమోదు చేసిన గాంధీనగర్ పోలీసులు.. వారిని అరెస్టు చేయడం మాత్రం మరిచిపోయారు. పైగా తమ తప్పు ఉండకూదనే ఉద్దేశంతో వారంతా పరారీలో ఉన్నట్లుగా చూపుతూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే విధ్వంసంతో సంబంధం ఉందనే ఆరోపణలతో ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని ఆలయంలో పురోహితుడు పి.శ్రీనివాసాచారి, మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు అడ్డాల నారాయణరావు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన మితేష్, రమేష్ సహానీ, మైనర్ విద్యార్థులు శరత్, సందీప్, న్యాయవాదులు శ్రీరంగారావు, ఆదిత్య, ఇంద్రసేన్‌రెడ్డి, రాము తదితరులపై కేసులు బనాయించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుల సంఖ్యను భారీగా చూపేందుకు పదుల సంఖ్యలో యువకుల అరెస్టులు చూపారు. ఇంతమందిని కష్టపడి కనిపెట్టి అరెస్టు చేసిన పోలీసులు... ఆ నలుగురి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారన్నది మాత్రం ‘మిలియన్’ డాలర్ ప్రశ్నగా మిగుల్తోంది. సంచలనం సృష్టించిన కేసుల్లో హంతకులను పట్టుకునేందుకు మెరికల్లాంటి పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే ఆ నలుగురినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఖాకీ బాస్‌లు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదేమో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి