24, మార్చి 2011, గురువారం

కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి?

పొద్దున్నే చలికి వణికిపోతూ తప్పని పరిస్థితిలో పనులున్నాయని లేచి కూర్చుంటున్నారా? మంచం మీద నుంచి కాలు కింద పెడదామంటే భరించరానంత నొప్పిగా ఉంటుందా? నొప్పి నివారణకు అదేపనిగా పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ చలికాలాన్ని ఎలాగోలా గడిపేయాల్సిందే అంటూ నిట్టూరుస్తున్నారా? చలికాలంలో ఎముకలకు, కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి? వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలా?

చలికాలం శరద్ రుతువు చివరన మొదలై హేమంత రుతువులో బలీయంగా ఉండి శిశిర రుతువు మొదటి భాగం వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉత్తర దిక్కు నుంచి వీచే అతి చల్లని గాలుల వల్ల మన చర్మం పొడిబారి, ఎండినట్టుగా అవుతుంది. చలి, రూక్ష గుణం(పొడిబార్చే గుణం) వల్ల వాతం ప్రకోపం చెందుతుంది. ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. సరైన వేళలో తగినంత ఆహారం తీసుకోకుంటే ఈ అగ్ని శరీర ధాతువులను వికృతం చేస్తుంది. భోజన వేళలు పాటించకపోతే వాతం వృద్ధి చెందుతుంది. అధిక ప్రయాణాలు, రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండటం, పగలు నిద్రించడం, చల్లని గాలులు అధికంగా ఉండటం... వల్ల వాతం ప్రకోపం చెంది (పెరిగి) అది శరీరంలో వివిధ అవయవాలలో చేరి అనేక వ్యాధులను కల్గిస్తుంది.
ఆమవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్):

శరీరంలోని ఆమం (అన్‌డెజెస్టైడ్ మెటీరియల్) ప్రకోపించి వాతంతో అనేక జాయింట్స్‌కు చేరి, అక్కడ తీవ్రమైన నొప్పిని, వాపును, మంటను కలిగిస్తుంది. ఈ వ్యాధులకు కారణభూతమైన ఆమం శరీరంలో విషంతో సమానమైంది. మిగిలిన కాలాలతో పోలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చలికాలంలో తీవ్రంగా ఉండి అమితమైన బాధకు గురిచేస్తుంది. ఈ వ్యాధి కేవలం జాయింట్స్‌లోనే గాక శరీరమంతా విస్తరించడంతో ఉదయం పూట శరీరం కదలించలేకపోతారు. ఆకలి మందగిస్తుంది. జ్వరంగా ఉంటుంది. కీళ్లలో తేలు కుట్టినంత నొప్పి ఉంటుంది. మలం దుర్వాసన వస్తుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా స్తంభించిపోయి, శరీరాన్ని కదిలించలేకపోతారు. మెల్లగా గుండెకు కూడా పాకుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్లీ తినడం, మసాలాలు, నూనె ఉన్న పదార్థాలు, మాంసాహారం, రాత్రిపూట పొద్దుపోయిన తర్వాత భుజించడం... వంటి కారణాల వల్ల ఈ వ్యాధి ఎక్కువవుతుంది. సంధివాతం, ఆమవాతంలలో కీళ్ల నొప్పులు వస్తాయి. చలికాలంలో అధికమవుతాయి. అయితే ఈ రెండింటి చికిత్సలో పూర్తి విరుద్ధమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఆమవాతం ఉన్నవారికి మొదట ఆకిలిని, జీర్ణ శక్తిని పెంపొందించాలి. కీళ్లలో ఉండే ఆమం (ఇన్‌డైజేషన్ మెటీరియల్)ను కరిగించే పాచన చికిత్స అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపేయాలి. ఈ చికిత్సలో వాలుకాస్వేదం, ధాన్యామ్లధార, కషాయధార, వస్తికర్మ, విరేచనం వంటి శోధన చికిత్సలు, ఔషధాలతో కలిపి శమన చికిత్స చేయాలి. శమన చికిత్సలో భాగంగా షడ్‌ధరనచూర్ణం, ఎరండతైలం, సింహనాదగుగ్గులు, ఆమవాతంరస్, షడ్గుణ సింధూరం, వాతగజాంకుశరస్ వంటి ఔషధాలు వాడాలి.
ముందు జాగ్రత్తలు:
ఆమవాతం లక్షణాలు కనిపించినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎప్పుడూ గోరువెచ్చని నీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే కనీసం వంద అడుగులు నడవాలి. శొంఠి చూర్ణం, బియ్యం కడుగును వేడినీళ్లతో సేవిస్తే ఉపశమనం పొందవచ్చు. ఈ ఆమవాతానికి ఉదయం పూట చిన్న చిన్న యోగాసనాలు చేస్తే మార్నింగ్ స్టిఫ్‌నెస్ నుంచి విముక్తి పొందవచ్చు. గృధ్రసీ వాతంలో కాళ్లు తిమ్మిరి పట్టడం, నడుంనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే భుజంగాసనం, వజ్రాసనం వంటి ఆసనాలు, వేడినీళ్లతో స్నానంతో ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాస్త గట్టిగా ఉండే పడకమీద నిద్రించాలి. రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోకూడదు. ఈ కాలం శరీరంలో వాతం ప్రకోపించడం వల్ల నొప్పులు (కండరాల నొప్పి), శరీరం పట్టేసినట్టు ఉండటం, సైనసైటిస్, బద్దకంగా అనిపించడం సాధారణ లక్షణాలు. అధిక రూక్షత్వం (పొడిబారడం) వల్ల చర్మం పొడిగా ఉండి దురద, పగుళ్లు, చుండ్రు ఎక్కువవుతాయి. చలికాలంలో ప్రతీ ఉదయం సాధారణంగా మన ఇళ్లలో లభించే నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దన చేసుకోవడం, ఉష్ణ జల స్నానం, వేడిని కలిగించే వస్ర్తాలతో శరీరాన్ని కప్పి ఉంచాలి. శీతల పానీయాలను తీసుకోకూడదు. తప్పనిసరిగా నెయ్యి భోజనంలో వాడాలి. పైన చెప్పిన పంచకర్మచికిత్సలు వ్యాధులను తగ్గించడమే కాకుండా, వ్యాధి రాకుండా చేస్తాయి. అయితే ఈ పంచకర్మలను నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి.
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్):
ఈ వ్యాధి ప్రకోపిస్తే వాతం సంధుల (కీళ్లు)లో చేరి ఎముకల అరుగుదలకు కారణమై వాపు, నొప్పి, తిత్తివటిస్పర్మ వల్ల ఎముకల మధ్య ఖాళీ ప్రదేశం తగ్గుతుంది. కాళ్లను కదిలించినప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడతారు. నడవలేరు. వ్యాధి తీవ్రావస్థలో నడవకున్నా విపరీతమైన బాధ కలుగుతుంది. ఈ వాతం కారణంగా కీళ్ల వద్ద ఎముకలను పట్టి ఉంచే డిస్క్ ముడుచుకొని ఉంటాయి. స్ర్తీలలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, చిన్న వయసులో గర్భాశయం తొలగించినప్పుడు కలిగే హార్మోన్ల అసమతుల్యం వల్ల, అధిక బరువు కారణంగా ఎముకల మీద ఒత్తిడి పెరిగి ఎముకలలో పటుత్వం తగ్గి ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.
చికిత్స:
రోగి వయసు, శక్తిని బట్టి శమన, శోధనకర్మ చికిత్స చేయాలి. శోధన చికిత్స శరీరంలో ఉండే అనేక విషపదార్థాలను బయటికి పంపడమే కాకుండా నీరసపడ్డ జీవకణాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వ్యాధి పూర్తిగా శోధనం అయిన తర్వాత శమన చికిత్స (ఔషధా లు) ద్వారా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ సంధివాతానికి చికిత్సలో అభ్యంగస్వేదనం చేయాలి. అభ్యంగన వల్ల శరీరంలోని అన్ని జాయింట్లలో కదలికలు సాధారణ స్థితిలో కల్పించవచ్చు. ఈ అభ్యంగ చికిత్సలో అవసరాన్ని బట్టి పత్రపోటల స్వేదం, కాయసేకం, వస్తికర్మ, షస్టికశాలిపిండస్వేదం, రక్తమోక్షణం (జలగలచే చెడు రక్తం తీయడం) వంటి పంచకర్మ ప్రక్రియల ద్వారా చికిత్స చేయాలి. వీటిలో వస్తికర్మ చాలా ప్రధానం. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. తైల అభ్యంగం, వేడినీటి స్నానం ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్లనొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగ, ఘృతం(నెయ్యి),

కీరదోస... లను విరివిగా తీసుకోవాలి. వ్యాయామాలు ఎక్కువగా చేయకూడదు.

మెట్లు, కొండలు, గుట్టలు ఎక్కడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు.

చల్లని నీటితో స్నానం చేయకూడదు.

తీపి, పులుపు రసాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

దుంపకూరలు, శనగపిండి తీసుకోకూడదు.
చలి కాలంలో బాధించే వ్యాధులు...
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్), ఆమవాతం (రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్), కటిశూలం (లో బ్యాకేక్), గృధ్రసీ (సయాటికా), అస్థిచ్యుతి (డిస్క్ ప్రొలాప్స్), శిరశ్శూల (మైగ్రెయిన్), అస్థి సౌషీర్యం (ఆస్టియో పోరోసిస్), వాతవహసిర (వేరికోస్‌వైన్స్), ఆర్జిత వాతం (ఫేసియల్ పెరాలసిస్), పక్షవాతం (పెరాలసిస్), నిద్రానాశనం (ఇన్‌సామ్నియా)... మొదలైనవి.
గృధ్రసీ వాతం (సయాటికా):
నడుములో నొప్పి మొదలై, కాలి బొటనవేలి వరకు లాగినట్లు నొప్పి ఉంటుంది. వెన్నెముకలో పూసలు (వర్టిబ్రే) అస్థచ్యుతి జరగడం, అరగడం, ఎముకల మధ్య ఉండే స్నాయువు (డిస్క్) ముందుకు జరగడం వల్ల అక్కడి నుంచి మొదలయ్యే నరాల మీద ఒత్తిడి పడి ఆ నరం శరీరంలో ఎక్కడి వరకు వెళుతుందో అంతమేరకు సూదులు పొడిచినట్టుగా నొప్పి, బాధ, తిమ్మిర్లు కలుగుతాయి. దీంతో రోగి కుంటినట్లు నడుస్తాడు. ఈ వ్యాధి వల్ల ఎక్కువసేపు నిలబడలేక , కూర్చోలేక, నడవలేకపోతాడు. ఎగుడు దిగుడు ప్రదేశాలలో నడవడం, అధిక ప్రయాణం, సరైన పరుపు, పాదరక్షలు వాడకపోవడం, నడుముకు దెబ్బ తగలడం, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, అధికబరువు మోయడం, తీవ్రమైన మలబద్ధకం మొదలైన వాటి వల్ల, పైన చెప్పిన వాత ప్రకోప కారణాల వల్ల వాత ప్రకోపం జరిగి నడుము ఎముకలలోని సందులలో కదలికలు ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది.
చికిత్స:
విరేచనం, వస్తికర్మ, కటివస్తికామసేకం, పత్రపోటలీ స్వేదం, షష్టికశాలి పిండస్వేదం మొదలైన శోధన కర్మలు ఈ సమస్యకు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు శమన చికిత్సలో భాగంగా బృహత్‌వాతచింతామణి, త్రయోదశాంగ గుగ్గులు, రసరాజరసం, యోగేంద్రరసం, రాస్నాసప్తక కషాయం.. అవసరం మేరకు వాడాలి.

వాతం ప్రకోపం చెంది శిరస్సును చేరినప్పుడు మైగ్రేన్, కళ్లనొప్పి, నిద్రానాశనం (ఇన్‌సామ్నియా) వస్తాయి. ఇతర హార్మోన్ సంబంధిత వ్యాధులను కలిగించే వాతం జీర్ణాశయం చేరినప్పుడు గ్యాస్‌ట్రబుల్, మలబద్ధకం, పైల్స్‌ను కలిగిస్తుంది. రక్తంతో చేరినప్పుడు శరీరంలో అనేక రకాలైన పుండ్లను, సిరలలో చేరినప్పుడు వేరికోస్ వెయిన్స్‌ను, గౌట్ కలిగిస్తుంది. వాతం - ఎముకలు, మజ్జతో చేరినప్పుడు కీళ్లనొప్పి, ఆస్టియోపోరోసిస్ కలిగిస్తుంది.

కామెంట్‌లు లేవు: