24, మార్చి 2011, గురువారం

ఒత్తిడి భారం తగ్గాలంటే

నగరాల్లో పెరుగుతున్న పని భారం వల్ల ఒత్తిడి బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీనివల్ల గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చిపడుతున్నాయి. అందుకే ఒత్తిడిని అధిగమించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. జీవనశైలి మార్చుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని వారు అంటున్నారు.

మెడిటేషన్, యోగ

మెడిటేషన్, యోగ వల్ల ఒత్తిడి దూరమవుతుంది. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి.
నిద్ర
ఒత్తిడి భారం తగ్గాలంటే కంటి నిండా నిద్ర పోవాల్సిందే. ఒత్తిడి నుంచి బయటపడటానికి మనసుకు, శరీరానికి తగినంత సమయం అవసరం. నిద్రలో శరీరానికి కావలసిన విశ్రాంతి లభిస్తుంది. సరిపడా నిద్ర పోతే ఒత్తిడి తాలూకు ఛాయలు కనిపించవు.
సమయానుగుణంగా..
ఆఫీసు వ్యవహారాలను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఒత్తిడి లేకుండా ఉంటుంది. అందుకోసం ప్రణాళికతో వ్యవహరించాలి. పనిని వాయిదావేయకూడదు. సమయానుగుణంగా నడుచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.
నో డ్రింక్
మందు తాగడం వల్ల ఒత్తిడి పోతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ నిజానికి అది తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుందంతే. రోజూ డ్రింక్‌కు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. డ్రింక్ చేయకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు డ్రింక్ జోలికి వెళ్లకుండా ఉండాలి.

సిగరెట్‌కు దూరం
చాలా మంది కొంచెం పని ఒత్తిడి పెరగగానే సిగరెట్ తాగడం కోసం బయటకు వెళుతుంటారు. సిగరెట్ తాగడం వల్ల రిలాక్స్ అవుతామని వారు భావిస్తుంటారు. కానీ అది తాత్కాలికమే. వాస్తవానికి పొగాకులో ఉండే నికోటిన్ స్పందించే గుణాన్ని మరింత పెంచుతుంది.
ఎక్సర్‌సైజ్
వ్యాయామం చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనా ధోరణి పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలసట దూరమవుతుంది. దీనివల్ల పనులు పెండింగ్‌లో పెట్టకుండా పూర్తి చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

కామెంట్‌లు లేవు: