5, మార్చి 2011, శనివారం

దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రిత్వానికి లాల్‌బహదూర్‌శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని ఆరు దశాబ్దాలపాటు చెప్పుకుని చెప్పుకుని తుత్తిపడ్డాం. వినీ, వినీ విన్నవారి చెవులు తుప్పు పట్టిపోయాయంటే నమ్మి తీరాలి మరి. నల్లారి కిరణ్‌కుమార్‌ మంత్రివర్గంలో దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి. రాష్ట్ర మంత్రి పదవికి మార్చి మూడో తేదీన జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసి త్యాగమూర్తుల సరసన చేరిపోయారు. తాను నమ్మిన విలువలకు వలువలు కట్టబూనుకున్న శాస్త్రి కంటే ప్రజల మనోభావాలకు స్పందించిన జూపూడి మిన్న అని నేను అంటే ఎవ్వరూ కాదనబోరనుకుంటాను. అయితే గియితే అంతగా ఆదాయం లేని దేవాదాయ శాఖ అంటే జూపల్లికి ఇష్టం లేకనే అధిష్టానాన్ని బెదిరించేందుకు రాజీనామా చేశాడని గిట్టనివాళ్లు, ప్రత్యేకించి సీమాంధ్రులు వాగితే వాగొచ్చుగాక. జూపల్లి పదవీ త్యాగం మామూలు వ్యవహారం కానేకాదు. అందుకనే అయన రాజ్యాంగాన్ని సైతం ధిక్కరించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్ధాయి మంత్రులెవరయినా రాజీనామా చేయదలిస్తే ముఖ్యంత్రి ద్వారా గవర్నరుకు సమర్పించుకోవాలి. కానీ జూపల్లి ఏకంగా తన అధిష్టాన దేవత సోనియమ్మకు రాజీనామా పత్రాన్ని పంపేసి తన అంతరంగాన్ని చెప్పకనే చెప్పేశారు. అదేమని అడిగిన పాత్రికేయులతో తాను ఏడాది క్రితమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తన త్యాగపూరిత ప్రణాళికను ప్రకటించానని గుర్తుచేశారాయన. మరి ఏడాది కాలంగా ఎందుకు త్యాగాలు చేయలేదేమని అడగ్గా … ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా” అంటూ జూపల్లి రాజీనామా వెనకున్న రహస్యాన్ని పరోక్షంగా విప్పకనే విప్పేశారనుకోండి. ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని ఇప్పుడూ నమ్ముతుంటే రాజీనామా ఎందుకు చేసినట్లో?” అని ఏ పాత్రికేయుడూ నోరు విప్పకపోవటం జూపల్లి తప్పుకాదుగదా! పాపం శమించుగాక! అంటే అయిపోయిందనుకోకండి. ఇంకా కొద్దిగా ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలను మన్నించి తాను పదవీ త్యాగానికి పాల్పడినట్లు ఆయన తెగచెప్పేసుకున్నారు. చెప్పేసుకున్నారంటే… చెప్పులు వేసుకున్నారనుకునేరు. ఆయన చెప్పులు వేసుకున్నాడో, బూట్లే వేసుకున్నాడో, అవి ఏ సంస్థవో తేల్చి చెప్పటానికి నేనెవర్ని? ఆ మాటకొస్తే అసలు వాటినయినా, వీటినయినా వేసుకున్నాడో? లేదో? కూడా చూడకుండా చెప్పటం కుదరదుగాక కుదరదుగదా! సరే చెప్పుల సంగతి అట్లా పెడదాం. ‘ప్రజల మనోభావాలు’ అన్న మాట ఉంది చూశారూ! ఎంతటి గొప్పదనుకుంటున్నారు. ఈ శతాబ్దానికి ముందు ఆ మాట ఎప్పుడూ విన్నట్లు నాకు గుర్తులేదు. ఆ ఎనిమిది అక్షరాల అద్భుత పదం ముందు అన్నీ దిగదుడుపేనని ఘంటాపదంగా చెప్పొచ్చు. అసలు దీన్ని ఈ శతాబ్దం పదంగా గుర్తించటమే కాకుండా, ఇటు దేశీయ లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ, అటు ప్రపంచస్ధాయి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ నమోదు చేయాలని నేను నొక్కి ఒక్కాణించదలచుకున్నాను. ఎవరికి ఏది ఇష్టమో, దాన్ని ప్రజల మనోభావంగా ప్రకటించేయవచ్చు. ఎవరికి ఏది కష్టమో దాన్ని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెగనాడనూ వచ్చు. అంటే ఈ పదం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అదే బాటలో జూపల్లి పయనించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా తన పదవిని త్యాగం చేసేసి త్యాగయ్య అయ్యారు. ఇక్కడే నా పాడు మనస్సు కీడు శంకిస్తోంది. అదేమంటే… ఇతరేతర పదవుల్ని అట్లా ూంచుదాం. ఆయన వైఎస్‌ పాలనలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. దానికి సంబంధించి ఒక చిన్న ప్రశ్నతో నా కు’శంక’ను తీర్చుకునేందుకు అంగీకరించండి. నా కుశంకను రాష్ట్రానికంతా వర్తింపజేయనులెండి. పేదలకు రేషను కార్డుల జారీ, వాటి ద్వారా చౌక దుకాణాల నిర్వహణ, వాటి ద్వారా దరిద్ర నారాయణులకు సరుకుల పంపిణీ తదితర జనోద్ధరణ కార్యక్రమాలన్నీ పౌరసరఫరాశాఖ ద్వారా జరగాల్సిన పనులు. మరి తెలంగాణ పేదలు తమకు రేషను కార్డులు వద్దనీ, ఎంత ధర పెట్టయినా తిండి గింజల్ని కొనుక్కుంటానమని మన జూపూడివారికి విన్నవించుకున్నారా? తెలంగాణలో చౌక దుకాణ యజమానులు సరుకుల్ని ప్రజల మనోభావాలకు అనుగుణంగానే దారి మళ్లించారా? అవునని జూపూడి అంటే పేచీ లేదు. అయితే రేషను కార్డు కావాలి మహాప్రభో అంటూ లక్షలాది మంది చేసుకున్న దరఖాస్తులు తెలంగాణ ప్రాంత తహశీలుదారుల కార్యాలయాల్లో మూలుగుతున్నందున జూపూడి ధైర్యం చేసి ఆ మాట అనగల వీలులేదు. చౌక సరుకుల్లో 60 శాతానికి తక్కువ కాకుండా దారి మళ్లుతున్న వైనం పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో వార్తల రూపాన కన్పిస్తుంటే రెండో ప్రశ్నకూ జూపూడి లేదని చెప్పలేదడనుకుంటాను. మరి పౌరసరఫరాలశాఖకు సంబంధించి ప్రజల మనోభావాలను మన్నించేందుకు పూనుకోని జూపూడి అనే పెద్దమనిషి దేవాదాయశాఖ మంత్రిగా మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించటం వెనుక ఏమయినా మతలబు ఉందా? అన్నదే నా కుశంక. నా కుశంకను ఎవరు తీరుస్తారు? చెప్మా!

కామెంట్‌లు లేవు: