5, మార్చి 2011, శనివారం
సొమ్ము వెదజల్లుతున్నాడు
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంది సొమ్మును అడ్డంగా దోచేసిన వైఎస్ తనయుడు జగన్మోహనరెడ్డి తానే గద్దెనెక్కేందుకు అన్ని మార్గాల్లోనూ వేటాడుతున్నాడు. ప్రధానంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు శతవిధాలా సొమ్ము వెదజల్లుతున్నాడు. తన సాక్షి పత్రికనూ, టీవీని జగన్మోహకరించిందిగాక, పాక్షికంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రసార మాధ్యమాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు మూడు వార్తా ఛానళ్లను 50 శాతానికి కొద్దిగా అటూఇటూగా బినామీ పేర్లతో కొనుగోలు చేసేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్రనాథ్ చౌదరి సంస్థాపిత ఎన్ టీలో 49 శాతాన్నీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అన్న ఐదు అత్యవసరాలు అందరికీ అందించే ధ్యేయం తమదంటూ పురుడుపోసుకున్న టీవీ-5లో 42 శాతం, టీవీ-9 పాత్రికేయులతో చిన్నపాటి సమరభేరి మోగించిన ఓ విద్యా వ్యాపారి రాజు భావోద్వేగ ఫలితంగా ఉద్భవించిన ఐ న్యూస్‌లో 51 శాతాన్ని యువనేత కొనుగోలు చేసినట్లు జగన్మోహనరెడ్డి శిబిరంలో పనిచేస్తోన్న ఒకరు ఉప్పందించాడు.ఈ మూడు ఛానళ్లు ఇక సాక్షి స్థాయిలో ఏకపక్షంగా జగన్మోహన చాలీసాలను అదే పనిగా భజనచేయకపోవచ్చేమోగానీ వ్యతిరేకంగా మాత్రం నోరు విప్పబోవు. అయితే ఈ ఛానళ్ల ద్వారా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసేందుకు జగన్మోహనుడి శిబిరం ప్రణాళిక రూపొందించుకున్నట్లు మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహనుడి శిబిరంలోకి చేరిపోయిన మూడు ఛానళ్లూ తొలి నుంచీ అంతో ఇంతో వైఎస్ రాజశేఖరరెడ్డి దొడ్డిలోనే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన రాగాన్ని ఆలపించేందుకుగాను సొమ్ముల్ని దక్కించుకుని నీకో సగం – నాకో సగం అంటూ పాడబోతున్నాయి. అంటే ఈ ఛానళ్లు ఇక సోనియా వ్యతిరేక, నకికురె వ్యతిరేక, తెదేపా వ్యతిరేక ఆలాపనలకు వేదికలు అవనున్నాయి. ఇక ఆ తరహా ఆలాపాలు వినాలో? వినకూడదో? నిర్ణయించుకోవలసింది మాత్రం వీక్షకులే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి