5, మార్చి 2011, శనివారం

గంటకు పది కోట్ల రూపాయలు నల్లధనం దేశం సరిహద్దులు దాటుతుంది ?

నిత్యావరాల ధరలు పెరిగాయని ఆందోళన చేసే సామాన్య జనంపై లాఠీలతోనూ, తూటాలతోనూ విరుచుకుపడే ప్రభుత్వం నల్లధనం మదుపుదారుల పట్ల ముద్దుముద్దుగా వ్యవహరిస్తోంది.1948 నుంచీ ఇప్పటి వరకూ రూ.20 లక్షల కోట్ల నల్లధనం దేశం సరిహద్దులు దాటి ఉంటుందని అంచనా.రోజుకు రూ. 240 కోట్లు నల్లధనం దేశ సరిహద్దులు దాటుతోంది, అంటే గంటకు పది కోట్ల రూపాయలు.కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్టు ధనబలానికి ఓ నకలు.రాజకీయ ధనబలం ముందు ప్రజాస్వామ్య విలువలు నానాటికీ కుంచించుకుపోతున్నాయి.2011-2012 బడ్జెట్టు మొత్తం కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేదిగా ఉంది.బడ్జెట్టులో వ్యవసాయ రంగానికి గతం కంటే రూ.5800 కోట్లు కోతపెట్టిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మాత్రం ఐదు లక్షల కోట్ల రూపాయలను రాయితీగా ఇచ్చింది.ఆదాయపు పన్ను మినహాయింపు ద్వారా రూ.88 వేల కోట్లు, ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు ద్వారా రూ.1.76 లక్షల కోట్లు, కస్టమ్స్‌ సుంకం తగ్గింపు ద్వారా రూ.2.24 లక్షల కోట్లు రాయితీలిచ్చింది.ఈ సొమ్ము 2జి స్పెక్ట్రం కుంభకోణంలో దారిమళ్లిన దానికన్నా మూడు రెట్లు అధికమని లెక్క.వ్యవసాయం, ఆహారభద్రత నిధుల కేటాయింపుల్లోనూ కోతలు పెట్టింది.దీనికితోడు వ్యవసాయరంగానికి ఇచ్చిన అరకొర రాయితీలు కూడా అటుఇటు తిరిగి కార్పొరేట్‌ సంస్థలకే చేరతాయి.వ్యవసాయ రంగానికి లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలిస్తున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నప్పటికీ వాస్తవానికి అవి కూడా పెద్దలకే దక్కుతున్నాయి.చిన్న- సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు నానాటికీ సన్నబడుతున్నాయి.ఇప్పుడు ఎన్నికలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయటమని భాష్యం.కోటీశ్వరులు మాత్రమే ఎన్నికయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.తద్వారా రాజకీయ అవినీతి పెరిగిపోతోంది.ధనబలం పెరుగుతోన్న కొద్దీ ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబింపజేసే వారు కనుమరుగవుతున్న విషయాన్ని అందరూ ఆలోచించాలని నేను కోరుతునాను.

కామెంట్‌లు లేవు: