అన్నయ్యకు తమ్ముడు దూరం అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అల్లు అరవింద్ బాటలో నడుస్తున్న చిరంజీవి నిర్ణయాలతో విసిగి పోయిన తమ్ముళ్లు పవన్ కల్యాన్, నాగబాబు ప్రస్తుతం అన్నయ్య పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అభిమానుల అండదండల కారణంగా ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలపడాన్ని పవన్, నాగబాబు జీర్ణించుకోలేక పోతున్నట్లుగా సమాచారం. ప్రజారాజ్యం పార్టీ కోసం నాగబాబు, పవన్ ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పార్టీ స్థాపనకు ముందు నాగబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి చిరు అభిమానులతో రహస్య మంతనాలు చేశారు. అందరినీ ఏకం చేశారు. పార్టీ పెట్టాక కూడా నాగబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఇక ఎన్నికల సమయంలో పవన్, నాగబాబు సోదరులు పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయించారు. సామాజిక న్యాయం పిఆర్పీ ద్వారానే సాధ్యమని చెపుతూ బలమైన కాంగ్రెసు, టిడిపిలపై విరుచుకు పడ్డారు. పవన్ అయితే మరో ముందడుగు వేసి షబ్బీర్ అలీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు, కాంగ్రెసు నేతల పంచెలూడదీసి కొట్టాలి అని ధ్వజమెత్తారు. ఒకవిధంగా చెప్పాలంటే గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు గెలుచుకోవడంలో చిరు మీద అభిమానానికి తోడు నాగబాబు, పవన్ ప్రచారం ప్రభావం చూపిందనడం ఎవరూ కాదనలేని నిజం. పిఆర్పీ నిలబడటానికి చిరంజీవి కన్నా పవన్, నాగబాబులే ఎక్కువ కృషి చేశారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.
అలాంటి నాగబాబు, పవన్ నిర్ణయంతో సంబంధం లేకుండానే చిరంజీవి తన బావమరిది అల్లు అరవింద్‌తో కలిసి పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని చిరంజీవి బావమరిది, తమ్ముళ్ల ప్రోత్సాహంతోనే వచ్చినట్టు వార్తలు వచ్చాయి. పార్టీ పెట్టాక అల్లు అరవింద్ అజమాయిషీ ఎక్కువైందన్న ఆరోపణలు వచ్చాయి. చిరుకు తెలియకుండా అల్లు టిక్కెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పార్టీ పెట్టిన కొద్ది రోజులలోనే మంచి మంచి నాయకులు అల్లు అరవింద్‌తో వేగలేక బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్లిన వారు చిరంజీవిని అల్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గత కొన్నాళ్లుగా తమ్ముళ్లు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అభిమానులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, కాంగ్రెసు, టిడిపిలకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం దిశగా దూసుకు వెళతామని చెప్పిన తాము ఇప్పుడు అభిమానులకు ఏం చెప్పాలని నాగబాబు, పవన్ అంతర్మథనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 18 సీట్లు కొత్తగా వచ్చిన పార్టీ గెలుచుకోవడం సాధారణ విషయం ఏమీ కాదని, ఇలాంటి సమయంలో కాంగ్రెసు, టిడిపిలో ఉన్న సంక్షోభాలను క్యాష్ చేసుకొని 2014 వరకు అధికారంలోకి ఎలా రావాలా అనే విషయంపై దృష్టి సారించకుండా కాంగ్రెసులో పిఆర్పీ విలీనం చేయడంపట్ల తమ్ముళ్లు తీవ్ర నిరాశలో మునిగినట్లుగా తెలుస్తోంది. బావమరిది అల్లు అరవింద్ చిరంజీవిని పార్టీ పెట్టినప్పటినుండి తప్పుదారి పట్టిస్తున్నాడనే యోచనలో వారు ఉండిపోయినట్లుగా సమాచారం. అన్నను తప్పుదారి పట్టిస్తుండటంతో అల్లు అరవింద్‌తో వేగలేక వారు ప్రస్తుతం తమ తమ సొంత వ్యాపకాల్లో మునిగి పోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గత కొన్నాళ్లుగా వారు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెసుతో విలీనం ప్రకటన తర్వాత పవన్ సినిమాలపై దృష్టి సారించినట్టుగా సమాచారం. నాగబాబు కూడా తన భవిష్యత్తుపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం తమ తమ వ్యాపకాల్లో దృష్టి సారించిన పవన్, నాగబాబు తర్వాత అయినా అన్న బాటలో కాంగ్రెసు వైపు పయనిస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చిరు కాంగ్రెసు వైపు వెళ్లడమే ఇష్టం లేని పవన్ కాంగ్రెసులో చేరి అన్నకు మద్దతుగా నిలిచే అవకాశాలు తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకుండా ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఒకవేళ వస్తే కనుక భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. పవన్‌కు బిజెపి నేతలతో మంచి సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే బిఎస్పీతో వెళ్లే అవకాశాలను కూడా కొట్టి పారేయలేక పోతున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి