21, ఏప్రిల్ 2011, గురువారం

ఎన్టీఆర్ తోక కత్తిరించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తన అల్లుడు నారా లోకేష్‌కు సినీ హీరో బాలకృష్ణ పూర్తి మద్దతు లభిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలనే చంద్రబాబు ఆలోచనను బాలకృష్ణ సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బాలకృష్ణ చెప్పిన మాటలు దాన్ని బలపరుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు సర్దుబాటు కోసమే ఆయన ఆ మాటలు అన్నా చాప కింద నీరులా లోకేష్‌కు పట్టం కట్టడానికి చంద్రబాబు చేస్తున్న ఏర్పాట్లకు బాలయ్య మద్దతు ఉందని అంటున్నారు.


నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టాలనే చంద్రబాబు వ్యూహాన్ని దెబ్బ తీయడానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముందుకు దూకి, కృష్ణా జిల్లా పార్టీలో ముసలం పుట్టించారని అంటారు. ఆ తర్వాత సమయం, సందర్భం కలిసి రాకపోవడంతో వారు తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. లోలోపల మాత్రం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి, ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు ప్లాన్‌ను దెబ్బ కొట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, బాలకృష్ణ మాత్రం చంద్రబాబు వెంట ఉండడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నందమూరి కుటుంబ సభ్యులను చీల్చడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పాలి. తన కుమారుడు లోకేష్‌తో బాలయ్య కూతురు బ్రాహ్మణికి పెళ్లి చేయడంలోని చంద్రబాబు ముందు చూపు అదేనని అంటున్నారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ పని చేసినట్లు చెబుతున్నారు. తన అల్లుడు లోకేష్‌కు వ్యతిరేకంగా పని చేసి జూనియర్ ఎన్టీఆర్‌ను బాలయ్య బలపరచడమనేది కలలోని మాటనే. నిజానికి, బాలయ్యకు, ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలను కలిపింది కూడా చంద్రబాబు నాయుడే. ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకోవడానికి ఆయన ఆ పని చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు అంత మేరకే చూస్తారు. అంతకు మించి పార్టీలో ఎదగాలని ప్రయత్నాలు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తోక కత్తిరించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరు. ప్రస్తుతం బాలయ్యతో కలిసి చంద్రబాబు నడుపుతున్న రాజకీయం అదేనని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: