21, ఏప్రిల్ 2011, గురువారం

సయోధ్య వార్తలు నిజం కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ మధ్య సయోధ్య వార్తలు నిజం కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కలిసి పని చేస్తామని ఇరువురు నాయకులూ ప్రకటించారు. కానీ అలాంటి పరిస్థితి ఏదీ లేదని అంటున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావుపై తీవ్రంగా ధ్వజమెత్తిన వంశీ ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి క్షమాపణలు చెప్పారు. అయితే, పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవడంతో వంశీ కాస్తా వెనకడుగు వేసినట్లు భావిస్తున్నారు.

చంద్రబాబు 62వ జన్మదిన వేడుకల వేదికపై వంశీ, ఉమ కలిసి కనిపిస్తారని అందరూ భావించారు. కానీ ఆ పరిస్థితి రాకుండా వంశీ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జన్మదిన వేడుకలకు వంశీ డుమ్మా కొట్టారు. తీరిక లేని పనుల వల్ల తాను చంద్రబాబు చెంతకు వచ్చి శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నానని వంశీ చెప్పారు. కానీ, అంత తీరిక లేని పనులు వంశీకి ఏమున్నాయనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుతో కూడా వంశీ నామమాత్రంగానే సయోధ్యకు అంగీకరించినట్లు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్ సూచన మేరకు తాత్కాలికంగా పార్టీలో పోరుకు వంశీ తెర దించినట్లు కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు: