22, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు.

అరచేతుల నుండి బూడిద, నోటి నుండి లింగాలు, గాలి నుండి గొలుసులు తీసే సత్యసాయి బాబా, మాములు మనిషా లేక అతీతశక్తులు కలిగిన దేముడా? బాబా కి రోగం వస్తే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళారు. ప్రాణం కాడికి వచ్చే సరికి వైద్యవిజ్ఞానం పైన ఆధారపడ్డారు. ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు. ఒక వైపు కిడ్నీలు, కాలేయం పాడైపోయి, ఊపిరి పీల్చుకోలేక వెంటిలేటర్ పైన బాబా మనుగడ సాగిస్తుంటే, కొన్ని టీవీ ఛానళ్లు ‘‘బాబా మళ్ళీ దర్శనం” ఇస్తారని’ ప్రచారం చేయటంలో మతలబు ఏమిటి? సత్యసాయి ట్రస్టు నడిపే ఆసుపత్రిలో పనిచేసే డా. సఫయా, బాబా ఆరోగ్య పరిస్థితిపైన తప్పుడు ప్రకటనలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. యీ ప్రకటనల విశ్వసనీయత పరీక్షించకుండా, కొంత మంది మీడియా, ఛానెళ్లు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం.


ఇరవైయి ఒకటవ శతాబ్దంలో మనిషి ఎంత పురోగతి సాధించినా, శాస్త్రీయ విజ్ఞానం ఎంత ప్రగతి చెందినా,అరచేతి లో స్వర్గం చూపించే బాబాలను నమ్మటం ఎంత శోచనీయం. జనం, ఆధ్యాత్మిక బాబాల మాయజాలం లో చిక్కుకుపోతున్నారు. మనిషి తన మీద తాను నమ్మకం కోల్పోయినప్పుడు, తన శక్తి సామర్ధ్యాల పైన విశ్వాసం కోల్పోయినప్పుడు, రాతి దేవుళ్ళని, అరచేతి స్వర్గం చూపే బాబాలను నమ్మడం మొదలుపెడతాడు. జనం బలహీనతలమీద బాబా గారు కోట్లాది రూపాయల ఆస్థి పోగేసుకున్నారు.

“చేతికి అంటుకున్న ఎంగిలి మెతుకులు కాకులకీ బిచ్చం వేసినట్లు” గా కొంత డబ్బును ఆసుపత్రులు, కాలేజీలపైన ఖర్చుపెట్టారు. బాబా కోటరీ లక్షలాది కోట్ల ఆస్తులతో రాజ భోగాలను అనుభవిస్తుంది. నడవలేని, మాట్లాడ లేని, ఆఖరి కి ఊపిరి తీసుకోలేని బాబాను, ఒక బొమ్మగా చేసి జగన్నాటకం ఆడుతున్నారు. ప్రముఖ తెలుగు దిన పత్రిక-టీవీ ఛానల్ పరిశోధనాత్మక రిపోర్టు ప్రకారం సత్యజిత్, డాక్టరు అయ్యర్ మరికొన్ని అదృశ్య శక్తులు బాబాను మత్తులో ముంచెత్తి, ఒక జీవచ్ఛవంగా మార్చారు. వీళ్ళ చుట్టూ బడా రాజకీయనాయకులు, గద్దె నెక్కిన మంత్రులు, పోలీసులు కాపలా కాస్తున్నారు.

కొంతమంది సత్యసాయి ట్రస్టు సభ్యులు, బాబా పైన మత్తుమందులు, డ్రగ్స్ ప్రయోగించారని ఆరోపణలు వున్నాయి. ఏబిన్ – ఆంధ్రజ్యోతి కొంత సాహసం చేసి బాబా బండారాన్ని, సత్యసాయి మందిరం చొరబడిన దొంగల కుట్రలను బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన బడా నాయకులు, హోమ్-మంత్రి చిదంబరం, రాజకీయ దళారులు, పోలీసు అధికారులకు సత్యసాయి ట్రస్టు కుంభకోణం తో సంబంధం వుందని తీవ్రమైన ఆరోపణలున్నాయి.

సాయిబాబా పేరున జరుగుతున్న తతంగం లోగడ ప్రేమానంద్, ఇన్నయ్య, అబ్రహాం కోవూర్, బయట పెట్టి విచారణ జరపమని కోరారు. ఎన్.టి.రామారావు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయమని ఉత్తరువులు ఇస్తే, చంద్రబాబు నాయుడు , పోలీసు అధికారి దొర లోపాయికారి వ్యవహారంతో ఆపారు. బెంగుళూరు వైస్ ఛాన్సలర్ నరసింహయ్య చాలెంజ్ చేసారు. పి.వి. నరసింహరావు, వాజపేయి, చివరకు అబ్దుల్ కలాం కూడా బాబా కాళ్ళు మొక్కి సెక్యులర్ సూత్రానికి ద్రోహం చేశారు. ఇప్పుడు బాబా విషయంలో జరుగుతున్న దానిని బట్టి అతను సామాన్య వ్యక్తి అని, మహత్తులు బూటకమనీ తేలింది. టి.వి. చానళ్ళు ఆధారాలు లేని ప్రసారాలు ఆపాలి .బాబా చుట్టూ మంత్రుల ప్రదక్షిణ అనుమానాలకు తావిస్తుంది గనుక వారు ప్రజలకు సంజాయిషి చెప్పాలి. తక్షణమే బాబా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని , గూడు పుఠాణి జరగకుండా చూడాలి.

బాబా ఆరోగ్య పరిస్థితి పైన రాష్ట్రప్రభుత్వం వాస్తవ పరిస్థితిని వెల్లడించాలి. సత్యసాయి ట్రస్టులోని లక్షలాది కోట్ల ఆస్తులను ప్రభుత్వం జాతీయం చేసి, ప్రజల ఆరోగ్య, విద్య అవసరాల కోసం వినియోగించాలి. టీవీ ప్రసారసాధనాలు బాబాలకు గుడ్డిగా భజన చేయకుండా, జర్నలిస్టు విలువలను కాపాడుతూ, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి. బాబాలు చెప్పే కట్టుకథలను నమ్మకుండా, శాస్త్రీయ దృక్పథం తో ఆలోచించి, విచక్షణా జ్ఞానం తో వాస్తవాలను తెలుసుకోవాలి. మానవతా విలువలతో, శాస్త్రీయ ఆలోచన విధానం తో వికసించే సమాజం కోసం కృషిచేయాలి

కామెంట్‌లు లేవు: