22, ఏప్రిల్ 2011, శుక్రవారం

నారా లోకేష్‌ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్

తన కుమారుడు నారా లోకేష్‌ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం చంద్రబాబు చెప్పిన మాటలే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం గురించి మీడియా ఊహాగానాలు చేస్తుందని ఆయన అన్నప్పటికీ లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని మాత్రం కొట్టి పారేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని తాను లోకేష్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆస్తులు పోగు చేయాలనే ఆలోచన ఉండకూడదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నారా లోకేష్ తమ కుటుంబ వ్యాపారాలను చూస్తున్నాడని, అప్పుడప్పుడు తనకు సలహాలు ఇస్తుంటాడని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు నగదు బదిలీ పథకం గురించి చెప్పింది నారా లోకేషేనని అంటారు.


ఇదిలా పుంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబమంతా తనతోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంతో తన బంధం మరింత పటిష్టమవుతోందని ఆయన చెప్పారు. నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్‌కు చేసుకోవడం ద్వారా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తమ సమీప బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుండడం ద్వారా ఆ బంధం మరింత గట్టి పడుతోందని ఆయన అన్నారు. దీన్ని బట్టి నందమూరి కుటుంబ సభ్యులు తన మాట జవదాటకుండా, తనకు అనుకూలంగా ఉండే విధంగా పెళ్లిళ్లతో చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు.

నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టేందుకు వీలుగానే చంద్రబాబు పెళ్లిళ్ల వ్యవహారాలు నడుపుతున్నారని ఆంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా ముందుకు రాకుండా ఉండడానికి తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మీప్రణతిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ చంద్రబాబును వ్యతిరేకించే స్థితిలో లేరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తనను వ్యతిరేకించకుండా చూసుకోగలితే నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి ముప్పు ఉండదనేది చంద్రబాబుకు తెలుసు

కామెంట్‌లు లేవు: