4, ఏప్రిల్ 2011, సోమవారం

కుటుంబలు మద్య విభేదాలు వచ్చాయి

రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన రెండు ప్రధాన కుటుంబాల మధ్య సంక్షోభం నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెసు పార్టీకి ఇన్నాళ్లుగా పెద్ద దిక్కుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబంలో చీలికలు వచ్చాయి. బాబాయ్ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మధ్య కుటుంబ విభేదాలు వచ్చాయి. దీనిని క్యాష్ చేసుకుందామని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం భావిస్తున్న తరుణంలో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఎన్టీఆర్ కుటుంబంలో కూడా పొరపొచ్చలు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు తన తర్వాత రాజకీయ వారసుడిగా తన తనయుడు లోకేష్ కుమార్‌ను చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు. దీనిని గమనించిన హరికృష్ణ తన తనయుడు ఎన్టీఆర్‌ను భావినేతగా ప్రజల ముందు ఉంచడానికే తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల కృష్ణా జిల్లా టిడిపిలో భగ్గుమన్న విభేదాలు అందుకు నిదర్శనమని పలువురు భావిస్తున్నారు.


కాంగ్రెస్‌ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దివంగత సిఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌ పార్టీని వీడటం, తమ్ముడు వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోవడంతో వైఎస్‌ కుటుంబం రెండుగా చీలింది. రానున్న ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నుంచి తన వదిన విజయలక్ష్మిపై పోటీ చేస్తానని, బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరని కూడా వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. నిత్యం వదినపై పోటీ చేస్తారా అని ప్రశ్నించే వాళ్లకు తన భార్య లోక్‌సభకు స్థానానికి పోటీ చేస్తే జగన్‌ పోటీ నుంచి తప్పుకుంటారా అని వివేకా ఎదురు ప్రశ్న వేస్తున్నారు. దీంతో వారి కుటుంబం మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీని కాపాడటం కోసం దివంగత వైయస్ కుటుంబాలను, పార్టీలోనుండి నేతలను చీల్చే వారు అనే అపవాదు ఉంది. అయితే ఇఫ్పుడు ఆయన కుటుంబమే రాజకీయాల కోసం చీలిపోయింది. కడప జిల్లాలో ఉన్న వైఎస్‌ కుటుంబసభ్యుల్లో మెజారిటీ శాతం జగన్‌ వైపే నిలవగా, కొద్దిమంది మాత్రమే వివేకా వెంట ఉన్నారు. అయితే, కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత ఈ సమీకరణలో మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదన్న అంచనా వివేకాలో కనిపిస్తోంది.

ఇక తెలుగుదేశం పరిస్థితి ఇందుకు మినహాయింపు కనిపించడం లేదు. అయితే, వైఎస్‌ కుటుంబం మాదిరిగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొనసాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హరికృష్ణ జూనియర్‌ ఎన్టీఆర్‌ మద్దతుదా రులయిన ఎమ్మెల్యే కొడాలి నాని, విజయవాడ నగర అధ్యక్షుడు వంశీ నేరుగా చంద్రబాబుపై దాడి చేయకుండా ఆయన మద్దతుదారుడైన ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమపై విరుచుకు పడటం విశేషం. ఎన్టీఆర్‌-హరికృష్ణకు మద్దతుదారులయిన మీడియా కూడా వీరికి అండగా ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు. తమకు ఎన్టీఆర్‌ కుటుంబమే ముఖ్యమని హరికృష్ణ మద్దతుదారులు స్పష్టం చేయటంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడం ద్వారా తమకు హరికృష్ణ -జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధానమని చెప్పకనే భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు చాలాకాలం నుంచి హరికృష్ణకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన వర్గీయులు హటాత్తుగా దేవినేనిని అడ్డుపెట్టుకుని బాబుపై పరోక్ష దాడి చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఇక బాలకృష్ణకు పార్టీలో క్రియాశీలపాత్ర పోషించాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, ఆయన తనకున్న కుటుంబ మొహమాటాల వల్ల ముందుకు రాలేక పోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, హరికృష్ణకు మాత్రం బాబు తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ పగ్గాలు తీసుకోవాలన్న కోరికతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హరికృష్ణ చేసిన ప్రక టనలు, విడుదల చేసిన లేఖల వల్ల పార్టీ ఇబ్బందిపడిన వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

లోకష్‌ను పార్టీలో క్రియాశీలంగా పాల్గొనడం హరికృష్ణ వర్గానికి రుచించడం లేదంట. ఇటీవల చంద్రబాబు నిరాహార దీక్షలో లోకేష్ బయటకు వచ్చారు. అయితే వైఎస్‌ కుటుంబానికి భిన్నంగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై ఎక్కడా బయటపడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ కుటుంబానికి సన్నిహుతులు మాత్రం ఎన్టీఆర్‌ కుటుంబంలో బాహాటంగా కలహాలు వచ్చే అవకాశం తక్కువేనంటున్నారు. ఏమైనా వచ్చినా ఈ సమయంలో వారు సర్దుకు పోతారనే వాదనలు వినిపిస్తున్నాయి

కామెంట్‌లు లేవు: