11, మే 2011, బుధవారం

ఎన్టీఆర్‌తో జగన్ చెలిమి ఎందుకు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎందుకు చెలిమి చేయాలని అనుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. అందుకు ప్రాతిపదిక ఏమైనా ఉందా అనేది కూడా ముఖ్యమైన విషయమే. రాజకీయాల్లో తన తండ్రి వారసుడిగా నిలబడేందుకు వైయస్ జగన్ ప్రయత్నాలు సాగిస్తుండగా, తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలనేది జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యం. ఒక రకంగా ఇద్దరి లక్ష్యం ఒకే విధమైంది. అయితే, ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తున్నవారి మధ్య స్నేహం సాధ్యమవుతుందా అనే దానికి ప్రాతిపదిక కూడా ఉంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. అధికారాన్ని కూడా ఈ రెండు వర్గాలే పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం సహాయంతో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి బిసీలు రంగం సిద్ధం చేసుకున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. కాంగ్రెసు నాయకత్వం కింద చిరంజీవిని అందుకు బిసీ వర్గాలు ఆలంబనగా చేసుకున్నట్లు భావించవచ్చు. అందుకు అనుగుణంగానే చిరంజీవికి కాంగ్రెసు అధిష్టానం పార్టీలో పెద్ద పీట వేసేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పటి వరకు రెడ్ల ఆధిపత్యంలో ఉండేది. దాన్ని క్రమంగా బిసీల దారి పట్టించేందుకు తెర వెనక ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెడ్ల గొడుగు పార్టీగా పరిణామం చెందే ప్రమాదం ఎక్కువగానే ఉంది. జగన్ వెంట ఎస్సీలు, బిసిలు ఉన్నప్పటికీ రెడ్ల పార్టీగానే ముద్ర పడే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీనే కాకుండా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా దెబ్బ తీయడం జగన్ లక్ష్యం. అందుకు బలమైన కమ్మ సామాజిక వర్గం మద్దతు జగన్‌కు అవసరంగా మారిందని చెప్పవచ్చు. చంద్రబాబును వ్యతిరేకిస్తున్న కమ్మ సామాజిక వర్గం నేతలు కాంగ్రెసు వెనక ఉన్నారు. వీరు జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్‌తో చెలిమి ద్వారా కమ్మ సామాజిక వర్గం మద్దతు కూడగట్టాలనేది జగన్ వ్యూహంగా భావించవచ్చు.

తక్షణమే తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టడం జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యం కాదు. చంద్రబాబు లోకేష్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారు. అందుకు తన బాబాయ్ బాలకృష్ణ మద్దతు లభించే అవకాశాలున్నాయి. అందువల్ల చంద్రబాబు రాజకీయ పథకాలను విఫలం చేయడమే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత లక్ష్యం. లోకేష్‌కు పార్టీ పగ్గాలు లభించకుండా చేయడమే ఆయన కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ లక్ష్యం కూడా అదే. తాత్కాలికంగా వైయస్ జగన్‌తో చెలిమి చేసి చంద్రబాబు వ్యూహాలను దెబ్బ తీస్తూ పోవాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: