11, మే 2011, బుధవారం

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి

కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని కచ్చితంగా చెప్పలేం. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు మాటల్లోని ఒక అంశం మాత్రం నిజమనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఇక దినదిన గండమేనని ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని చెప్పవచ్చు. ఉప ఎన్నికలు, ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాస్తా ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇటు జగన్ వ్యవహారం గానీ అటు తెలంగాణ అంశం గానీ ఆయనను తీవ్రంగా వేధించలేదు. ఉప ఎన్నికల్లో తాను చేయాల్సిందంతా చేస్తున్నానని ఆయన ఇంత కాలం అనిపించుకున్నారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి పెరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికల ఫలితాలను చూపించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశాలు చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఆయనను ఇరకాటంలో పెట్టేందుకే వారు ప్రయత్నాలు సాగిస్తారని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల విమర్శలను తిప్పికొట్టడానికి మంత్రులు ముందుకు వస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యాస్త్రం విసిరారు. కడప ఉప ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుగడలను ఆయన తప్పు పట్టారు. మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న సీనియర్ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం సహకరించే అవకాశాలు లేవు. తమ పనేదో తాము చేసుకు పోతున్నామని మాత్రమే అనిపించుకునేందుకు పరిమితమవుతారని చెప్పవచ్చు.

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. తనను కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదించడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన గుర్రుగా ఉన్నారని సమాచారం. పరిస్థితిని చక్కదిద్దడానికి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద ఇప్పుటికైతే ఏ విధమైన అస్త్రాలు లేవు. నామినేటెడ్ పదవులు మాత్రమే ఆయన వద్ద ఉన్నాయి. అయితే, వాటిని భర్తీ చేస్తే పార్టీలో అసంతృప్తి మరింత పెరగవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుంచి డిఎస్‌తో పాటు సీనియర్ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా, ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరోసారి తెలంగాణ అంశం రాజకీయాలను వేడెక్కించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఇవ్వకపోతే తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు కూడా ఏదో ఒక కార్యక్రమానికి ముందుకు రాక తప్పదు. దీనివల్ల కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కష్టాలు తప్పేట్లు లేవు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి ముళ్ల మీద నడకే అవుతుందనడంలో సందేహం లేదు.

కామెంట్‌లు లేవు: