తెలంగాణపై తన పోరాటంలో వెనక్కి తగ్గడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేరు. తాను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గానీ పార్టీకి వ్యతిరేకం కాదంటూనే చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. చంద్రబాబు అనుకూల తెలంగాణ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ విస్తృత స్థాయి సమావేశం నుంచి మధ్యలో బయటకు వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ జెండా లేకుండానే తాను సభలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. రేపు శనివారం పరిగి తెలంగాణ నగారా సభ కూడా పార్టీ జెండా లేకుండానే జరుగుతుందని, ఈ సభకు అందర్నీ ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. రేపటి సమావేశానికి అందరూ వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సమావేశంలో పార్టీ జెండా లొల్లే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్లాలనే ఆలోచన చేయలేదని, అటువంటి సమావేశంలో తాను ఎలా కూర్చుంటానని ఆయన అన్నారు. సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగింది కాబట్టి చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. తాను నిర్వహించిన నాగర్ కర్నూలు సభ ప్రకంపనలు సృష్టించిందని, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే సమావేశం నిర్వహించానని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజల సమీకరణకు పార్టీ జెండా పెడితే ఎలా వస్తారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం చేపట్టే ఉద్యమంలో పార్టీ జెండా పెడితే అన్ని పార్టీలవాళ్లు రారని ఆయన అన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా పార్టీ జెండా పెట్టడం లేదని, ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో ఎలా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ సాధించుకోగలుగుతామని ఆయన చెప్పారు. కాలం చెల్లిన ప్రణబ్ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామంటే ఎవరు నమ్ముతారని ఆయన అడిగారు. తాము కలిసినప్పుడు చంద్రబాబు నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖ కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం సంకేతాలిచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ నాయకులు స్పష్టత లేదని ఆయన అన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి