తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల్లో నాగం జనార్దన్ రెడ్డి ఒంటరి అయినట్లే కనిపిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం తెలుగుదేశం తెలంగాణ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయాలు జరిగాయి. తెలంగాణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై శుక్రవారం ఈ సమావేశం జరిగింది. సమావేశంలో శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, నాగం జనార్దన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో నాగం జనార్దన్ రెడ్డి సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో టిడిపి తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటుతో నాగం జనార్దన్ రెడ్డికి చెక్ పెట్టాలన్న వ్యూహం ఈ సమావేశంతోనే అమలు కావడం ప్రారంభమైందని చెప్పవచ్చు.
శుక్రవారం జరిగిన తెలంగాణ విస్తృత స్థాయి సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డి హాజరు కాగా, హరీశ్వర్ రెడ్డి గైర్హాజరయ్యారు. పరిగిలో శనివారం జరిగే తెలంగాణ నగారా సభ ఏర్పాట్లలో ఉండడం వల్లనే ఆయన రాలేకోపయారని చెబుతున్నారు. పరిగి సభకు వెళ్లాలా, వద్దా అనే విషయంపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలో చేయాలని తలపెట్టిన నగారా సభలకు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గం బ్రేకులు వేసే కార్యక్రమానికి సిద్ధపడింది. ఈ నెల 25వ తేదీన కరీంనగర్ జిల్లాలో నగారాను నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
ఇక ముందు తెలంగాణ నగారా సభలు పార్టీ జెండాలతోనే జరపాలని కూడా నిర్ణయించింది. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇస్తేనే పార్టీ జెండా పెట్టాలని నాగం జనార్దన్ రెడ్డి పెట్టిన మెలికను ఆయన వ్యతిరేకవర్గం తిప్పికొట్టింది. ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట నుంచి తలపెట్టిన పాదయాత్ర కూడా సందిగ్ధంలో పడింది. ఈ కార్యక్రమాన్ని భువనగిరి శానససభ్యురాలు ఉమా మాధవ రెడ్డి అభ్యంతరం చెప్పారు. పార్టీలో పదవులు అనుభవించినప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా అని ఎర్రబెల్లి దయాకర రావు నాగం జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను ఒక్కడినే లేనని, తన వెంట చాలా మంది ఉన్నారని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి