అమెరికన్లకు వింత భయం పట్టుకుంది. యుగాంతం గురించి ఎన్నో కథనాలు, మరెన్నో ఆసక్తికర విషయాలు పుకార్లుగా షికార్లు చేస్తున్న ఇటీవలి కాలంలో అమెరికాలో మరో ఆసక్తి కోణం వెలుగులోకి వచ్చింది. కొందరు 2012లో యుగాంతం సంభవిస్తుందని చెబుతుంటే కొందరు అమెరికన్లు మాత్రం ఈ రోజే (మే 21, 2011 శనివారం) యుగాంతం సంభవిస్తుందని ప్రచారం చేస్తున్నారు.
క్రిస్టియన్ మతస్థుల పరమ పవిత్ర గ్రంధమైన బైబిల్ ప్రకారం... శనివారం అంటే మే 21న ప్రపంచం అంతమై పోతుందని హెచ్చరిస్తూ అమెరికాలోని న్యూయార్క్‌లో కొంతమంది కరపత్రాలు, బ్రోచర్లు, పుస్తకాలు మరియు పోస్టర్లతో నగరంలోని కూడలి ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా పెను భూకంపం సంభవించి ప్రపంచం అంతమైపోతుందని హెచ్చరిస్తూ న్యూయార్క్ సిటీ సబ్‌వేలో అడ్వర్టయిజ్‌మెంట్లు సైతం వెలిసాయి. అక్కడి ప్రజలు మే 21ని ‘జడ్జిమెంట్ డే’గా పేర్కొంటున్నారు.
మరి బైబిల్ ప్రకారం మే 21, 2011 రోజునే ఈ ప్రళయం ఎలా సంభవిస్తుందని చెప్పగలరు..? ఇందుకు సమాధానం కాలిఫోర్నియాకు చెందిన క్రైస్తవ మత ప్రచార రేడియో అయిన ఫ్యామిలీ రేడియో అధ్యక్షుడు హరోల్డ్ క్యాంపింగ్ వద్ద ఉంది ఆయన లెక్కలు వేసి విశ్లేషించిన దాని ప్రకారం.. ఈ ప్రళయం శనివారమే జరుగుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ‘బైబిల్ ప్రకారం 4990 సంవత్సరంలో జలప్రళయం సంభవించినప్పుడు తాను ఈ భూగోళాన్ని ఏడు రోజుల్లో నాశనం చేస్తానని ప్రభువు చెప్పాడు. అలాగే ఏడురోజుల్లో ఆయన దాన్ని నాశనం చేస్తాడు’ అని హరోల్డ్ వాదిస్తున్నారు.
అంతేకాకుండా.. ఏసు ప్రభువు తనకు ఒక్క ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానమని చెప్పినట్లు హరోల్డ్ అంటున్నారు, దీని ప్రకారం.. అంటే 4990 సంవత్సరాలు, వెయ్యేళ్లకు ఒక రోజు చొప్పున 7001 సంవత్సరాలు మొత్తం కలిపితే 2011 సంవత్సరం. కాబట్టి ఈ రోజునే ప్రళయం సంభవిస్తుందని హరోల్డ్ లెక్కలు కట్టారు. ఇంకా అప్పటి క్యాలెండర్ ప్రకారం ప్రళయం సంభవించిన రెండో నెల 17వ రోజు, ఇప్పుడు మే 21, 2011వ తేదీ ఒకటే కావడాన్ని బట్టి చూస్తే ఆ ప్రళయం శనివారమే జరుగుతుందని హరోల్డ్ అంటున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చాలానే వచ్చాయి. ఏది జరిగినా భగవంతునిపై భారం వేసి మన జీవన ప్రయాణం కొనసాగించక తప్పదు మరి. అంతా మంచే జరగాలని, అందరూ హాయిగా ఉండాలని కోరుకుందాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి