తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఢీకొట్టడానికే సిద్ధపడ్డారు. ఈ నెల 9వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో జరిగే తెలంగాణ బహిరంగ సభ దానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు. పార్టీ జెండా లేకుండా నడిచే ఈ బహిరంగ సభకు లభించే ప్రతిస్పందనను చూసి నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా తన గొంతును మరింత పెంచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే, నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబును లెక్క చేయకుండా ప్రకటనలు చేస్తున్నారు.
నాగం జనార్దన్ రెడ్డి పార్టీలోని తెలంగాణ నాయకులు కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి, దయాకర్ రెడ్డి వంటి నాయకులు నాగం తీరును తప్పు పడుతున్నారు. అయినా, నాగం జనార్దన్ రెడ్డి లెక్క చేయడం లేదు. అయితే, నాగం జనార్దన్ రెడ్డికి పార్టీలోని ఓ వర్గం మద్దతు బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. నాగర్ కర్నూలు బహిరంగ సభకు తెలంగాణ పార్టీ నాయకులంతా వస్తారని ఆశిస్తున్నట్లు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. కానీ అ పరిస్థితి కనిపించడం లేదు.
నాగం జనార్దన్ రెడ్డి వెంట హరీశ్వర్ రెడ్డి (రంగా రెడ్డి జిల్లా), వేణుగోపాలాచారి (ఆదిలాబాద్), విజయ రామారావు (హైదరాబాద్), ఉమా మాధవ రెడ్డి ( నల్లగొండ) వంటి నాయకులు నడిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీరు నాగర్ కర్నూలు బహిరంగ సభకు హాజరయ్యే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 9వ తేదీ బహిరంగ సభనే పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి