7, మే 2011, శనివారం

యువనేత ఓటుకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకూ పంపిణీ చేస్తారన్న???

ఎన్నికలకు రెండు రోజుల ముందు కడప జిల్లాలో యువనేతకు ఆయన వర్గంలోని ముఖ్యమైన ఎమ్మెల్యే షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో తన గెలుపు నల్లేరు మీద బండి నడకని భావిస్తున్న యువనేతకు గట్టి షాక్ తగిలినట్లయింది. సొంత పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ఆయన వైఖరే ఆయనకు ఇబ్బందులు తెస్తోంది. తన మాటే చెల్లాలన్న యువనేత వైఖరి పట్ల ఆ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా లెక్క విషయంలో అసంతృప్తితో ఉన్న ఒక కీలక ఎమ్మెల్యే మరీ ఇంత తక్కువైతే ఎలాగంటూ యువనేతపై ఫైర్ అయ్యారని సమాచారం. తాను ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిల్లోనూ ఇంత కంటే ఎక్కువ ఖర్చు పెట్టానంటూ నిలదీసినట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఇలాగైతే తన దారి తాను చూసుకుంటానని యువనేతను కూడా హెచ్చరించాడంట. నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు చేసుకునే సామర్థ్యం కలిగిన ఆ నేత ఆగ్రహం వ్యక్తం చేయడంతో యువనేత కంగు తిన్నారని సమాచారం. అయితే తన మాట తప్ప వేరెవరి మాటనూ లక్ష్య పెట్టని యువనేత ఏ మాత్రం వెనక్కు తగ్గక పోవడంతో.. ఆ ఎమ్మెల్యే కినుక వహించినట్లు తెలుస్తోంది. రూ. లక్ష కోట్లకు అధిపతిగా బహుళ ప్రాచుర్యం పొందిన ఆ యువనేతకు ఇప్పుడు ఆ డబ్బే కట్లపామై కరిచేందుకు సన్నద్ధమైందని పలువురు భావిస్తున్నారు. ఉప ఎన్నికల బరిలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు ఓటుకు 200 నుంచి 500 వరకూ పంపిణీ చేస్తే యువనేత పార్టీ మాత్రం కేవలం 200 రూపాయలు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించారని సమాచారం. ఈ నిర్ణయం పట్ల నేతల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

ఇప్పటివరకూ యువనేత ఓటుకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకూ పంపిణీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే అందుకు విరుద్ధంగా యువనేత మాత్రం సెంటిమెంట్ అస్త్రంతో తాను గెలవడం ఖాయమని ఓటుకు నోటు ఇవ్వాల్సిన అవసరమే లేదని వాదిస్తున్నారట. అందరూ కోరుతున్నందున ఆ మాత్రం లెక్కయినా ఇచ్చానని ఇక ఏమాత్రం ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచే అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశించిన యువనేత షాక్ తిన్నారంటున్నారు. ఈ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే యత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికిప్పుడు తమ వైపునకు రాకున్నా రెండు రోజుల పాటు మౌనంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది.

కామెంట్‌లు లేవు: