15, జులై 2011, శుక్రవారం

అమ్మ నాదే...

అంబరాన పూసిన తారలు కోసి
మాలచేసి నీ జడలొ తురుముతానంటే
మురిసిపోయింది అమ్మ ముసిముసి నవ్వులతో

హరివిల్లుని పట్టి తెచ్చి నీకు ఊయలకట్టి ఊపుతానంటే
చిరునవ్వుతో నా తల్లీ అంటూ ముద్దులాడింది

సఖులతో చేరి ఆటలాడగా
బుజ్జగించి, ఊసులెన్నో చెప్పి బొజ్జ నింపింది

నిదురమ్మ రానని మొరాయిస్తుంటే
చందమామని చూపి లాలిపాడి జోకొట్టింది

సూరీడు తాపం చురుక్కుమంటూ బాధిస్తుంటే
తన కొంగునే గొడుగుగా కప్పి పొదుముకుంది

వానజల్లులో తడిసి, మెరుపు గర్జనలకు ఉలిక్కిపడితే
నేనున్నానురా అంటూ వెన్ను తట్టింది లాలనగా

ఆటలలో చిన్ని గాయమై కంటతడిపెడితే
తన గుండెల్లో దిగిన బాకులా విలవిలలాడింది

అమ్మ ఆప్యాయతను ఆలంబనగా చేసుకొని
అందరికంటే ఉన్నతంగా ఎదిగినప్పుడు
అక్కున చేర్చుకుంది అశ్రునయనాలతో...

మరచిపోగలమా? తీర్చుకోగలమా?
అమ్మను. ఆమె ప్రేమని.. నేర్పిన పాఠాలను
అందుకే అమ్మ నాదే...