15, జులై 2011, శుక్రవారం

ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే.

ఓ శుభవార్త తెలియగానే ఆనందం, ఆలోచనలు భవిష్యత్ వైపు సాగినప్పుడు తెలీని దిగులూ, మనసు గాయపడిన క్షణం ఆక్రోషం.. ఇలా ప్రతీ భావోద్వేగమూ మనసులోనే సిద్ధంగా ఉంటుంది. తటస్థించే అనుభవానికి తగ్గ భావోద్వేగం మనలో వెన్వెంటనే పెల్లుబుకుతూ కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేసి గమ్మున సర్దుకుంటుంది. మంచిదైనా, చెడ్డదైనా ఓ సంఘటన జరిగిన వెంటనే మదిలొ వేగంగా జరిగే సంఘర్షణ తాలూకు వ్యక్తీకరణలే మన భావోద్వేగాలు. ప్రతీ భావోద్వేగమూ దాని తీవ్రత కొనసాగినంత సేపూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పనిలో పనిగా మనసులో ఏ మూలనో ఆ సంఘటన తాలూకు గాఢతని మరువలేని జ్ఞాపకంగా నమోదు చేసి.. తీవ్రత తగ్గిన వెంటనే దూదిపింజెలా ఎగిరిపోతుంది. భావోద్వేగాల మర్మాన్ని గ్రహిస్తే అవి మనపై స్వారీ చేసే ముందే వాటి తీవ్రతని కట్టడి చేసుకోగల విజ్ఞత అలవడుతుంది. ఏ ఆనందానికైనా, ఆవేశానికైనా, విచారానికైనా కల్లోలితం అయ్యే ఆలొచనా ప్రవాహమే మూలం. వాటిని వీలైనంత వేగంగా స్థిరత్వం వైపు మళ్లిస్తే ఆ భావోద్వేగపు గాఢత క్షీణించిపోతుంది. మిన్ను విరిగి మీదపడ్డా మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయే నైపుణ్యత అలవడుతుంది. మన ఆలోచనలు నిరంతరం జరిగిపోయిన జీవితాన్నీ, ముందు భవిష్యత్తునీ, వర్తమానపు అనుభవాలనూ, బలంగా నాటుకుపోయిన జ్ఞాపకాలనూ మనసు పొరల్లోంచి వెలికి తీసి వాటిని చిక్కుముళ్ల్లుగా పెనవేసి కుదురుగా ఉన్న మనసుని కూడా ఆందోళనపరుస్తుంటాయి.
ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే. అవసరం అయిన దానికన్నా దాన్ని మరింత విశ్లేషించి, సంఘటనలు, ఆలోచనల్ని క్లిష్టతరం చేసుకుని ఆ ఉద్వేగాన్ని సులభంగా వదిలిపెట్టకుండా మనసుని కుళ్లబెట్టుకుంటూ ఉంటాం. ఈ క్షణం మన మానసిక స్థితి అస్థిరంగా ఉంటే దాన్ని స్థిరపరుచుకోవడం మన చేతుల్లో ఉన్న పని. కానీ ఆ కిటుకుని గ్రహించలేక పాటించలేకపోతున్నాం. సమస్యల్లో ఉన్న స్థితిలో మనమూ సమస్యలో కూరుకుపోయి బయటపడే మార్గాన్ని ఆలోచించడం మనేసి సమస్యని పెద్దది చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆవేశం కట్టలు తెంచుకుంటే దానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించి, మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తల వైపు దృష్టిని నిమగ్నం చేయకుండా వీలైనంత ఆవేశాన్ని వెళ్లగక్కుతుంటాం. ఇలా భావోద్వేగం యొక్క మూలాల్ని గుర్తించి వాటిని సరిచేసుకునే మార్గం ఒకటుంటే.. ఏకంగా భావోద్వేగం మనపై స్వారీ చేస్తున్నప్పుడు దాని నుండి బయటపడడానికి మరెన్నో మార్గాలున్నాయి.
ఒక భావోద్వేగాన్ని పరిసరాలపై వెదజల్లడం మన ఉనికిని, మనం ఆశిస్తున్న గమనింపుని పొందడానికి సులువైన మార్గం అనే దురభిప్రాయం బాల్యం నుండి మనకు ఉగ్గుపాలతో అలవర్చబడింది. ఉదా. కు.. మనం ప్రదర్శించిన ఆవేశానికి ఆశించిన స్థాయి స్పందన దాన్ని ఎవరిపై ప్రదర్శించామో వారి నుండి లభిస్తే మన అహం సంతృప్తిపడుతుంది. ఎంత ఆవేశపడినా దాన్ని పట్టించుకునేవారు లేనప్పుడు కాసేపు మనసు రగిలిపోతుంది. మెల్లగా నిస్సహాయత ఆవరిస్తుంది. దిగులు మొదలవుతుంది. చివరకు బేలగా మారిపోతాం. ఇది ఒక ఆవేశమనే భావోద్వేగపు పరిణామక్రమమే. ఇలా ప్రతీ భావోద్వేగానికీ కొన్ని బలమైన కారణాలు, అంచనాలూ, పర్యవసనాలూ ఉంటాయి. వాటన్నింటినీ విశ్లేషించి మన చిత్తం చేసే చిత్రాల్లో ఎంత విచిత్రం దాగుందో అర్ధం చేసుకోగలిగితే ఆ మాయ నుండి అవలీలగా బయటపడగలం !

కామెంట్‌లు లేవు: